శనగ రైతుకు అందని ‘మద్దతు’ | - | Sakshi
Sakshi News home page

శనగ రైతుకు అందని ‘మద్దతు’

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

అదనపు కొనుగోళ్ల ప్రతిపాదనను

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

కర్నూలు(అగ్రికల్చర్‌): మద్దతు ధర లభించక శనగ రైతులు భారీ ఎత్తున నష్టాలు మూట కట్టుకున్నారు. క్వింటా శనగలకు మద్దతు ధర రూ.5875 ఉండగా మార్కెట్‌లో రూ.5000 లోపే ధర లభిస్తోంది. మద్దతు ధరతో శనగలు అరకొరగా కొనుగోలు చేసి.. చేతులు దులపుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అరకొరగా కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన నాఫెడ్‌ కొనుగోలు చేసింది. శనగల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదు. నాఫెడ్‌ జిల్లాకు 12,880 టన్నుల శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా.. నెలన్నర క్రితమే ఈ మేరకు కొనుగోలు చేయడం పూర్తి అయింది. అదనంగా కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది. ఈ లేఖను ప్రభుత్వం కేంద్రానికి పంపింది తప్ప ప్రత్యేక చర్యలు లేవు. నెలన్నర క్రితం అదనంగా శనగల కొనుగోలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. మద్దతు ధరతో శనగలు అమ్ముకున్న రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు విడుదల చేయడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. శనగల కొనుగోళ్లు ముగిసి నెలన్నర రోజులవుతున్నా ఇప్పటికి దాదాపు 1100 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ కాలేదు. మామూలుగా అయితే విక్రయించిన 10 రోజుల్లో నగదు చెల్లించాల్సి ఉంది. కాని రెండు నెలలవుతున్నా... నగదు జమ కాకపోవడం పట్ల రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement