రైతు ఉసురు తీసిన అప్పులు | - | Sakshi
Sakshi News home page

రైతు ఉసురు తీసిన అప్పులు

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

సి.బెళగల్‌: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని క్రిష్ణదొడ్డిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణస్వామి(46) తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు, గత కొంతకాలంగా మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, ఉల్లి, మిరప, శనగ పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా పంటల సాగుకు పెద్ద ఎత్తున పెట్టుబడి ఖర్చులు రావడంతో పాటు సరైన దిగుబడులు రాలేదు. పైగా పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తెలిసిన వారు, బంధువుల దగ్గర దాదాపు రూ.10 లక్షలకు పైగా అప్పు చేశాడు. ఈ క్రమంలో పంటలకు చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని గత రెండు రోజులుగా మదనపడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం అనంతరం కుటుంబ సభ్యులు గమనించినా అప్పటికే మరణించాడు. ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య జయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం.

Advertisement
 
Advertisement
Advertisement