● ఎమ్మిగనూరులో నిలిచిపోయిన
అభివృద్ధి పనులు
● పనులు చేపట్టేందుకు
ముందుకు రాని కాంట్రాక్టర్లు
ఎమ్మిగనూరుటౌన్: అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులను పట్టాలెక్కిస్తాం అని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు. ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కి 23 నెలలవుతున్నా అభివృద్ధి పనులు చేయలేకపోయారు. కోట్ల రూపాయల్లో ఉన్న పెండింగ్ బిల్లులను మంజూరు చేయలేదు. ఫలితంగా కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నారు. ఫలితంగా ఎమ్మిగనూరు పట్టణంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు.
రూ.3 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి ఎమ్మిగనూరులోని పలు ప్రాంతాల్లో అట్టహాసంగా అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. గత మున్సిపాలిటీ పాలక వర్గం ఆమోదించిన పలు అభివృద్ధి పనులను సైతం పోటీ పడి మరీ ప్రారంభించారు. అందులో సీసీ రోడ్లు, డ్రైన్లు ఉన్నాయి. అయితే గతంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.3 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా వాటిని విడుదల చేయలేదు. దీంతో కొన్ని సీసీ, బీటీ, డ్రైన్ల నిర్మాణాలు ప్రారంభించినా వాటిని మధ్యలోనే నిలిపేశారు. దీంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చేసిన పనులకు సంబంధించిన బిల్లులు సత్వరం మంజూరయ్యేలా ప్రతిపాదనలు పంపాం. అందుకు సంబంధించి బిల్లులు ప్రాసెస్ చేస్తున్నాం. కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నది వాస్తవమే. ప్రస్తుతం మంచినీటిపైప్ లైన్లు, డ్రైనేజీ పనులకు ప్రాధాన్యతనిస్తున్నాం. రోడ్ల పనులు కూడా చేపడతాం.
– గంగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్
వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఎమ్మిగనూరు పట్టణంలోని గంజిళ్ల రోడ్డు ఇది. దీని నిర్మాణానికి రూ.99 లక్షలతో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. వెనువెంటనే రోడ్డు పనులను టెండర్ ద్వారా దక్కించుకొన్న కాంట్రాక్టర్ గుంతలు పడ్డ రోడ్డుపై కంకర పరిచి వదిలేశాడు. నెలలు గడుస్తున్నా ఆయా పనులు మాత్రం ముందుకు కొనసాగలేదు. గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు కాకపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు చేయలేనంటూ చేతులెత్తేసినట్లు తెలిసింది. ఫలితంగా గోతులమయమైన ఈ రోడ్డుపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి.


