అత్యవసర వైద్యం..పెద్ద కష్టం | - | Sakshi
Sakshi News home page

అత్యవసర వైద్యం..పెద్ద కష్టం

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

ఐవీఆర్‌ఎస్‌లో రోగుల పెదవి విరుపు

కర్నూలు పెద్దాసుపత్రికి కింద నుంచి నాలుగవ స్థానం

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అందుతున్న వైద్యసేవలపై ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఈ ఆసుపత్రికి కింది నుంచి నాలుగో స్థానాన్ని కేటాయించారు. ఏకంగా 32.49శాతం మంది రోగులు వైద్యసేవలపై వ్యతిరేక అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆయా ప్రభుత్వ శాఖలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవలపై కొంత కాలంగా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ఫీడ్‌బ్యాక్‌(అభిప్రాయ సేకరణ) తీసుకుంటోంది. ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 67.51శాతం మంది అనుకూలంగా 32.49శాతం వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని చెప్పారు.

ఆసుపత్రుల అధికారులకు తాకీదులు

కర్నూలులోని స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో 71.20 శాతం అనుకూలంగా, 28.86శాతం మంది వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆదోనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 71.49శాతం అనుకూలంగా, 28.51శాతం వ్యతిరేకంగా, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి 72.73శాతం అనుకూలంగా 27.27శాతం మంది వ్యతిరేకంగా చెప్పా రు. ఈ విషయమై ఆయా ఆసుపత్రుల అధికారులకు ఉన్నతాధికారుల నుంచి తాకీదులు వచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు వైద్యసేవలను మెరుగుపరిచే దిశగా చర్యలు ప్రారంభించారు.

రోగుల తీవ్ర అసంతృప్తి

ముఖ్యంగా వైద్యులు, స్టాఫ్‌నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర ఉద్యోగుల సమయపాలన సరిగ్గా లేదు. కొందరు వైద్యులు ఓపీల్లో సైతం ఉండటం లేదు. ముఖ్యంగా సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో ఎక్కువ శాతం పీజీ వైద్యులే ఉంటున్నారు. మధ్యాహ్నం తర్వాత ఓపీలో కేవలం ఒకరిద్దరు పీజీ వైద్యులతో నడిపిస్తున్నారు. రక్తపరీక్షలు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, సీటీ స్కానింగ్‌, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ వంటి వ్యాధినిర్ధారణ పరీక్షల నివేదికలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆపరేషన్‌లు సకాలంలో జరగకపోవడం, మందులు, వైద్యపరీక్షలు సగం బయటే తీసుకోవాలని చెప్పడం వంటి అంశాలూ రోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి. రోగుల ఫీడ్‌బ్యాక్‌ సరిగ్గా లేకపోవడంతో ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement