● ఎనమిదవ రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం స్వామివారు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఎనమిదవ రోజు ఆలయ అర్చకులు సుదర్శనాచార్యులు, సంజీవాచార్యులు, పవనాచార్యులు పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, సంప్రోక్షణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి పాండురంగడు ప్రత్యేక అలంకరణంలో గరుడవాహనంపై భక్తులకు కనువిందు చేశారు. ఆలయం నుంచి గాంధీసెంటర్ వరకు స్వామివారి గ్రామోత్సవం వైభవంగా కొనసాగింది. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన భక్తులు పాండురంగ విఠలేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడసేవను పురష్కరించుని ఆలయ ఆవరణలో నెల్లూరు కళాకారులు నిర్వహించిన ఆర్కెస్ట్రా అలరించింది. సోమవారం గజ వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.


