ఎమ్మిగనూరురూరల్: గుడేకల్ చెరువులో గల్లంతైన బాలిక ఆఫ్రిన్ మృతిచెందారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు.. చిన్నారి మృతదేహాన్ని ఆదివారం బయటకు తీసుకువచ్చారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ఆంధ్రాల గ్రామం నుంచి శ్రీ అల్లిపీరా స్వామి ఉరుసులో పాల్గొనేందుకు తల్లి రజియా బేగం, ఏడేళ్ల కుమార్తె ఆఫ్రిన్‌లు కలసి వచ్చారు. దర్గాకు వెళ్లే ముందు పవిత్రంగా కాళ్లు, చేతులు కడుకందామని శనివారం గుడేకల్ చెరువు కు వెళ్లారు. కాలుజారి తల్లీబిడ్డ లోతైన చెరువులో పడిపోయారు. గమనించిన స్థానికులు ప్రాణాలు తెగించి తల్లి రంజియాబేగంను కాపాడగలిగారు. చిన్నారి మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆదివారం ఉదయం విగతజీవిగా ఆఫ్రిన్ కనిపించడంతో తల్లి గుండెపగిలెలా రోదించారు. భర్తను కోల్పోయిన రజియా ఇప్పుడు కుమార్తెను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి బళ్లారి జిల్లా ఆంధ్రాల గ్రామానికి తరలించారు. ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


