బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి అదే గ్రామానికి చెందిన డేరంగుల బాలాంజనేయు లు, నాగార్జున కుటుంబ సభ్యులు రూ.1,50,116 విరాళాన్ని ఆలయ పాలక మండలి చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డికి ఆదివారం అందజేశారు. ఈ మేరకు విరాళం అందజేసిన దాత కుటుంబ సభ్యులను సత్కరించారు.
నిర్వాసితులకు బాబు ద్రోహం
నందికొట్కూరు: శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారని నీటిముంపు నిరుద్యోగ సంఘం నాయకులు జయన్న ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 39 రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు కోరలేదని, 98 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. నీటిముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి లష్కర్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. రహంతుల్లా, నాగేంద్రుడు, నారాయణ, మురళి, మౌలలి, రాజు, తదితరులు పాల్గొన్నారు.
మహిళ ఆత్మహత్య
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం గ్రామానికి అరిగెల శిరీష(37) ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త రామకృష్ణకు వెన్నెముక ఆపరేషన్ కావడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యాడు. శిరీష కూడా అనారోగ్యం బారిన పడి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. మనస్తాపానికి గురై శనివారం రసాయన పౌడర్‌ను నీటిలో కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు వెంటనే బేతంచెర్ల ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు.
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
బనగానపల్లె: పట్టణంలోని మంగళవారం పేటకు చెందిన చైతన్యరెడ్డి (23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక రైల్వేస్టేషన్‌కు రెండు కిలో మీటర్ల దూరంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు నంద్యాల రైల్వే స్టేషన్ ఎస్‌ఐ కుమారి తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
దోపిడీ దొంగ అరెస్ట్
బొమ్మలసత్రం: పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తిని బెదిరించి రూ. 20 వేలు దోచుకున్న దొంగను ఆదివారం వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన వెంకటస్వామి గత నెల 22వ తేదీ టీవీ కొనేందుకు రూ. 20 వేల నగదుతో బస్టాండ్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. పోరుమామిళ్లకు చెందిన షేక్‌షఫి స్కూటీపై వచ్చి సుధాకర్‌ను ఢీకొట్టి చంపుతానని బెదిరించి రూ. 20 వేల నగదు లాక్కుని పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం షేక్‌షఫిని బస్టాండ్ సమీపంలో గుర్తించి అరెస్ట్ చేశారు. రూ. 20 వేల నగదు, స్కూటీని స్వాధీ నం చేసుకున్నారు.
అమ్మవారికి పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీ భ్రమరాంబా, మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులను ఆశీనులు గావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేపట్టారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.


