పొగాకు కంపెనీ నిర్లక్ష్యానికి రైతు బలి | - | Sakshi
Sakshi News home page

పొగాకు కంపెనీ నిర్లక్ష్యానికి రైతు బలి

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

ఓర్వకల్లు: పొగాకు కంపెనీ నిర్లక్ష్యంతో రైతు ఖాజామొహిద్దీన్‌ మృతి చెందాడని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. రైతు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక జీపీ ఐ పొగాకు కంపెనీ యాజమాన్యం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. నాణ్యత ప్రమాణాల పేరుతో ఆత్మకూరు, ఆళ్లగడ్డ, అలంపూరు వంటి దూర ప్రాంతాలకు దిగుబడులు తీసుకురమ్మనడం దారుణమన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు వందల కి.మీ ప్రయాణించి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఒప్పందం మేరకు స్థానికంగా కొనుగోలు కేంద్రం ప్రారంభించాలన్నారు. మృతుడు ఖాజామొహిద్దీన్‌ కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, పాణ్యం జెడ్పీటీసీ మాజీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ రంగనాఽథ్‌గౌడు, వైఎస్సార్‌సీపీ నాయకులు కాశిరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఐటీ విభాగం అధ్యక్షులు శివకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, అయ్యపురెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఈనెల 2వ తేదీన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన గుట్టపాడు గ్రామానికి చెందిన రైతు మహబూబ్‌బాషాను పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధితుడికి పరిహారం అందించాలని కోరారు.

చికిత్స పొందుతూ రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓర్వకల్లుకు చెందిన రైతు షేక్‌ ఖాజామొహిద్దీన్‌(56) చికిత్స పొందుతూ కోలేక మృతి చెందాడు. మృతుడు ఓర్వకల్లు ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు షేక్‌ ఉస్మాన్‌బాషా సోదరుడు. గత నెల 30వ తేదీన జోగులాంబ అలంపూరులోని పొగాకు కొనుగోలు కేంద్రానికి ట్రాక్టర్‌లో దిగుబడి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్‌ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌ వంతెనపై వెనుక నుంచి ఓ ప్రైవేట్‌ బస్సు కొట్టింది. ఈ ప్రమాదంలో షేక్‌ ఖాజామొహిద్దీన్‌కు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి కుదుట పడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. అక్కడి వైద్యుల సల హా మేరకు మృతుని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement