కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోవెలకుంట్ల– ముదిగేడు ఆర్‌అండ్‌బీ రహదారిలో ఆదివారం నిర్వహించిన గుర్రపుబండి పరుగు పందెం పోటీలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని బనగానపల్లె, ఆత్మకూరు, బండిఆత్మకూరు, కోవెలకుంట్ల మండలాలకు చెందిన ఎనిమిది గుర్రాలు పోటీల్లో పాల్గొన్నాయి. నిర్ణీత పది కిమీ దూరాన్ని బనగానపల్లెకు చెందిన రాజా గుర్రపు బండి 19.28 నిమిషాల్లో పరిగెత్తి మొదటిస్థానంలో నిలిచి రూ. 10వేల బహుమతి కై వసం చేసుకుంది. ఆత్మకూరుకు చెందిన రసూల్ గుర్రం 20.18 నిమిషాల్లో చేరి ద్వితీయస్థానంలో రూ. 5వేలు, కోవెలకుంట్లకు చెందిన పెద్దయ్య గుర్రం 20.50 నిమిషాల్లో చేరి మూడవ స్థానంలో నిలిచి రూ. 3వేలు బహుమతిని దక్కించుకున్నాయి. పాండురంగస్వామి ఆలయ కమిటీ, కోవెలకుంట్లకు చెందిన పృద్వీరాజ్, పెద్దయ్య ఆర్థిక సహకారంతో గుర్రపుబండి యజమానులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ చిన్న వెంకటసుబ్బారెడ్డి, కరిమద్దెల మురళీకృష్ణ, పెనుగొండ రాజశేఖర్, చెన్నకృష్ణుడు, లక్ష్మినాగేంద్రబాబు, రాంమోహన్‌రెడ్డి, రాజు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.


