కర్నూలు(అర్బన్): వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కర్నూలు యార్డు సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఆర్ జయలక్ష్మి చెప్పారు. ఆదివారం స్థానిక మార్కెట్‌యార్డులో ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు తెలుగు నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు బంగి శ్రీధర్, నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప, సురేష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శేషగిరి శెట్టి మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీలలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తించేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు బంగి శ్రీధర్ మాట్లాడుతూ.. ఉద్యోగులందరు కలిసికట్టుగా ఉంటు హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటరత్నం, కోశాధికారి డీసీ వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు బీ శ్రీరాములు, ఉపాధ్యక్షులు పీవీ కిరణ్, అనంతపురం, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఈశ్వర్, నరసింహారెడ్డి పాల్గొన్నారు.


