కల్లూరు: కల్లూరు మండలం బస్తిపాడు గ్రామ పొలిమేరలోని సమాధుల పల్లెలో సర్వే నెంబర్ 382లోని 1.93 ఎకరాల గ్రామ కంఠం భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆ భూముల్లో అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామ కంఠం భూమిని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు చదును చేయడంతో విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి శనివారం స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రజల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. భూములు ఆక్రమిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరును తూర్పారబడ్డారు. ఈ మేరకు స్పందించిన రెవెన్యూ అధికారులు ఆదివారం హెచ్చరిక బోర్డును పాతారు. ఇది ప్రభుత్వ భూమి అని, సర్వే నెంబర్ 382లోకి అక్రమంగా ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డులో పేర్కొన్నారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి చొరవతోనే ప్రభుత్వ కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.


