● నదికై రవాడి గ్రామస్తుల ఆందోళన
నందవరం: దేవుడి మాన్యం సర్వేకు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని నదికై రవాడి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంజనేస్వామి ఆలయానికి 23.97 ఎకరాల మాన్యం భూమి ఉందని, వాటిని అక్రమంగా అనుభవిస్తున్నారన్నారు. ఆక్రమదారులతో రెవెన్యూ , దేవాదాయ శాఖ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దేవుడి మాన్యం రీ సర్వేకు హాజరు కావాలని గ్రామపెద్దలకు నోటీసులు ఇచ్చి శనివారం అధికారులు రాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు వెంకటేష్, కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గ్రామస్తులమంతా ఉదయం 9 గంటలకు దేవుడి మాన్యం సర్వేకు వచ్చామని మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు రాకపోవడం ఆశ్చర్యాన్ని గురిచేస్తోందన్నారు. అధికారులు స్పందించకపోతే విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మధ్యాహ్నం 2 గంటలకు మండల సర్వేయర్ అక్బర్‌బాషా, సర్వే సిబ్బంది హాజరు కావడంతో వారితో గ్రామస్తులు వాగ్వాదం చేశారు. సర్వే అధికారి అక్బర్‌బాషా మాట్లాడుతూ.. గ్రామస్తులకు నోటీసులు జారీ చేసిన విషయం వాస్తమవేనని, సర్వేకు దేవాదాయ శాఖ అధికారులు రాలేదని తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యం
నదికై రవాడి దేవుడి మాన్యం సర్వేలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. సర్వే కోసం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ అబ్దుల్‌వాహబ్, ఆదోని డివిజన్ దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లులు, ఆర్‌ఎస్‌డీటీ మహేస్‌కుమార్, మండల సర్వేయర్ అక్బర్ బాషా సమావేశం నిర్వహించారు. అనంతరం అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో సర్వేకు హాజరు కాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో దేవుడి మాన్యం సర్వే వాయిదా పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అసిస్టెంట్ దేవాదాయ శాఖ కమిషనర్ సుధాకర్‌రెడ్డిని ఫోన్ ద్వారా వివరణ కోరగా.. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మూడు రోజుల పాటు సర్వేను వాయిదా వేయమని కోరినట్లు తెలిపారు.


