5న ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

5న ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

కర్నూలు(సెంట్రల్‌): ఉపాధి కార్యాలయంలో ఈనెల 5న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్‌మేళాలో అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, ఫార్మ ట్రైనీ అసోసియేట్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు, స్కిల్‌ టెస్టులు నిర్వహిస్తారన్నారు. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయని.. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఫార్మసీ–డీ/బీ/ఎం/ఎం ఫార్మసీ పాసై 18–30 సంవత్సరాల మధ్య వయస్సు యువతీ యువకులు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 5వ తేదీన ఉపాధి కార్యాలయంలో 10 నుంచి 5 గంటల మధ్య ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు www.ncs.gov.in, www.empoyment.ap.gov.in అనే వెబ్‌సైట్లలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

ఐదేళ్ల బాలుడికి డెంగీ

ఆలూరు రూరల్‌: స్థానిక సిద్దేశ్వర కాలనీకి చెందిన ఓ బాలుడికి డెంగీ పాజిటివ్‌ నమోదైనట్లు మలేరియా నివారణ ఆదోని ప్రాంతీయ అధికారి మంజునాథ్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఐదేళ్ల బాలుడికి గత నెల 27న తీవ్ర జ్వరం రావడంతో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. 28న వైద్య పరీక్షల్లో బాలుడికి డెంగీ పాజిటివ్‌గా నిర్ధారించారు. అయితే మెరుగైన చికిత్స అందించడంతో ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం వైద్యారోగ్య శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది బాలుడి ఇంటి పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

మలేరియా అధికారిగా వెంకటేశులు

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లా మలేరియా నియంత్రణ అధికారిగా టి.వెంకటేశులు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో సీనియర్‌ ఎంటమాలజిస్టుగా పనిచేస్తున్న ఆయనకు ఇన్‌ఛార్జి మలేరియా అధికారిగా బాధ్యతలు అప్పజెప్పారు. త్వరలో ఎంటమాలజిస్టులను మలేరియా అధికారులుగా నియమించనున్నారు. అప్పటి వరకు ఈయనే ఆ పోస్టులో కొనసాగనున్నారు. జిల్లా మలేరియా అధికారి నూకరాజు గురువారం ఉద్యోగ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీగా మారిన విషయం విదితమే. అనంతపురం జిల్లాకు చెందిన వెంకటేశులు హెల్త్‌ అసిస్టెంట్‌గా, హెల్త్‌ సూపర్‌వైజర్‌గా, సబ్‌ యూనిట్‌ మలేరియా అధికారిగా, అసిస్టెంట్‌ మలేరియా అధికారిగా, సీనియర్‌ ఎంటమాలజిస్టుగా వివిధ స్థాయిల్లో విధులు నిర్వహించారు.

హెల్త్‌ యూనివర్సిటీ సెనేట్‌ మెంబర్లుగా కేఎంసీ వైద్యులు

కర్నూలు(హాస్పిటల్‌): డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ సెనేట్‌ మెంబర్లుగా కర్నూలు మెడికల్‌ కాలేజి వైద్యులు నియమితులయ్యారు. ఇందులో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌, కమ్యూనిటీ మెడిసిన్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ సింధియా శుభప్రద, పెథాలజి హెచ్‌ఓడీ డాక్టర్‌ బాలేశ్వరి, జనరల్‌ సర్జరి ప్రొఫెసర్‌ డాక్టర్‌ జయరామ్‌ ఉన్నారు. వీరు ముగ్గురూ మూడు సంవత్సరాల పాటు యూనివర్సిటీకి సెనెట్‌ మెంబర్లుగా వ్యవహరిస్తారు. వీరి ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ అభినందించారు.

అటవీ శాఖ కర్నూలు సర్కిల్‌ కన్జర్వేటర్‌గా సెల్వం

కర్నూలు కల్చరల్‌: అటవీ శాఖ కర్నూలు సర్కిల్‌ కన్జర్వేటర్‌గా 2012 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సి.సెల్వం నియమితులయ్యారు. పలువురు కన్జర్వేటర్లకు స్థానచలనం కలిగింది. కర్నూలు కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న 2010 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ బీవీఏ కృష్ణమూర్తిని విశాఖపట్నం ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, ఏపీఎఫ్‌డీసీ లిమిటెడ్‌ ఆర్‌ఎంగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో తిరుపతి ఎస్వీ జూలాజికల్‌ పార్క్‌ క్యురేటర్‌గా విధులు నిర్వహిస్తున్న సి.సెల్వంను నియమించారు. నంద్యాల ప్రాజెక్ట్‌ టైగర్‌ సర్కిల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న 2020 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అనురాగ్‌మీనాను తిరుపతి ఎస్వీ జూలాజికల్‌ పార్క్‌ క్యురేటర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో మంగళగిరి పీసీసీఎఫ్‌ కార్యాలయంలో ఐటీ వింగ్‌ డిప్యూటీ సీఎఫ్‌గా విధులు నిర్వహిస్తున్న 2019 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ సి.చైతన్య కుమార్‌ రెడ్డిని నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement