● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకలు నిర్వహించారు. స్థానిక సి.క్యాంపు సెంటర్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక లోకం సాగించిన దీర్ఘకాల పోరాట ఫలితంగా 8 గంటల పని హక్కును సాధించుకున్న చారిత్రాత్మక రోజు మేడే అన్నారు. సమాన హక్కులు, గౌరవ ప్రదమైన జీవితం కోసం కార్మికులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. దేశ అభివృద్ధిలో కార్మికులు, కర్షకులు ప్రధాన స్తంభాలని వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు. కార్మికులకు తగిన గౌరవం, భద్రత, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. కార్మికుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, ట్రేడ్ యూనియన్ అధికార ప్రతినిధి కటారి సురేష్, నగర అధ్యక్షుడు ప్రకాష్, రామాంజనేయులు, బబ్లూ గోల్డ్ శీను, నగర మహిళా అధ్యక్షురాలు మంగమ్మ, ట్రేడ్ యూనియన్ నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


