కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు శుక్రవారం పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీలో ఉన్న వైద్యులు నిర్ణీత సమయానికి వస్తున్నారా?, షిఫ్ట్ సమయం ముగిసే వరకు అందుబాటులో ఉంటున్నారా? అని పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రి సేవలను డిజిటలైజ్ చేసే క్రమంలో నెక్ట్స్ జనరేషన్ ఈ–హాస్పిటల్ వెబ్‌సైట్‌లో రోగులకు సంబంధించిన వివరాలు, రిపోర్టులు, ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆర్‌ఎంఓలు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
కేస్ షీట్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
కర్నూలు(హాస్పిటల్): కేస్ షీట్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు నర్సులను ఆదేశించారు. ఆయన శుక్రవారం ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో మాట్లాడుతూ.. రోగి ఆసుపత్రికి వచ్చిన సమయం నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతి అంశాన్ని కేసు షీట్‌లో క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. రోగి ఏ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరారు. వారికి అందించిన వైద్యసేవలు, నిర్వహించిన పరీక్షల వివరాలు స్పష్టంగా ఉండాలన్నారు. వైద్యసేవల్లో పారదర్శకతను పెంచేందుకు, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రతి స్టాఫ్‌నర్సు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు, హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులు పాల్గొన్నారు.


