అవుకు(కొలిమిగుండ్ల): సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా పెళ్లి అంటే వారి స్థాయికి తగ్గట్లుగా శుభలేఖలు అచ్చు వేయించి పంచుతుంటారు. ధనవంతులు పెండ్లి పత్రిక అందంగా, ఖరీదుగా ఉండేలా చూసుకుంటారు. కానీ వీటన్నిటింటికీ భిన్నంగా అవుకు మండలం మెట్టుపల్లెలో శుక్రవారం బ్యాగులో మొక్కలు ఉంచి బంధువులు, గ్రామస్తులను ఆహ్వానించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మేకల వెంకటేశ్వరరెడ్డి పెద్ద కుమారుడు ఉపేంద్రరెడ్డి వివాహం సందర్భంగా ఆయన సోదరుడు, సుప్రీంకోర్టు న్యాయవాది గణేష్‌రెడ్డి ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగులపై పెళ్లి వివరాలు ముద్రించారు. వాటిలోనే మొక్కలను పెట్టి ఊర్లో బంధువులు, మిత్రుల ఇంటింటికీ వెళ్లి అందిస్తూ తమ సోదరుడి వివాహానికి రావాలని కోరుతున్నారు. తప్పకుండా మొక్కలను మీ ఇళ్ల వద్ద నాటుకోవాలని సూచిస్తుండటం విశేషం.


