కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో జూనియర్ సహాయకులు/ టైపిస్టులుగా విధులు నిర్వహిస్తున్న 13 మందికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు పదోన్నతి పొందిన వారికి జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి నియామకపత్రాలను అందించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నా రు. ఈ నేపథ్యంలోనే రికార్డు అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్ పదోన్నతులతో పాటు కారుణ్య నియామకాలను కూడా చేపడుతున్నారు.
సమయపాలన పాటించకపోతే చర్యలు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని సచివాలయాల ఉద్యోగులు సమయపాలన పాటించడంతో పాటు పారదర్శక సేవలు అందించాలని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల జిల్లా అధికారి టీవీ భాస్కర్‌నాయుడు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులు గ్రామాలు, వార్డుల్లో పర్యటించే సమయంలో కార్యాలయంలోని మూమెంట్ రిజిస్టర్‌లో తప్పక నమోదు చేయాలన్నారు. ఆయా సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కాకుండా అదనంగా ఒక్క రూపాయ వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫించన్ల పంపిణీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తామన్నారు.
22ఏ జాబితా నుంచి భూముల తొలగింపు
కర్నూలు(సెంట్రల్): 22ఏ జాబితాలో ఉన్న భూములను తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈమేరకు గురువారం ఆమె కాన్ఫరెన్స్ హాలులో పలువురు రైతులకు 22ఏ జాబితా నుంచ తొలగించిన భూములకు సంబంధించిన పత్రాలను అందజేశారు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 22ఏ జాబితాలో ఉన్న భూములను సాధారణ భూములుగా మార్చేందుకు వీలుంటుందని, ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో చిరంజీవి, ఆర్‌డీఓ కె.సందీప్‌కుమార్ పాల్గొన్నారు.


