నీట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Apr 30 2026 8:07 AM | Updated on Apr 30 2026 8:07 AM

మే 3వ తేదీన 16 కేంద్రాల్లో నిర్వహణ

కర్నూలు(సెంట్రల్‌): వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు మే 3వ తేదీన నిర్వహించే నీట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో ఆమె నీట్‌ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో నీట్‌ పరీక్షకు 16 కేంద్రాలను ఏర్పాటు చేయగా 4,928 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని, విద్యార్థులు 1.30 గంటల్లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో చిరంజీవి, నీట్‌ పరీక్ష కోఆర్డినేటర్‌ పాయల్‌ ప్రియదర్శి పాల్గొన్నారు.

టూర్‌ ప్యాకేజీల ముసుగులో మోసాలు

కర్నూలు(టౌన్‌): వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు ట్రావెల్‌ ఏజెన్సీల పేరుతో ఆకర్షణీయమైన టూర్‌ ప్యాకేజీలంటూ ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్‌ మీడియా, వాట్సప్‌ల ద్వారా ప్రకటనలు ఇస్తున్నారని, అడ్వాన్స్‌ పేరుతో డబ్బులు వసూలు చేసి సంప్రదింపులను నిలిపివేయడం, నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్‌ రివ్యూల ద్వారా మోసం చేస్తున్నారన్నారు. ఏ ట్రావెల్‌ ఏజెన్సీ అయినా ప్రజలు ముందుగా ధృవీకరించుకోవాలని, అధికారిక వెబ్‌సైట్‌, రిజిస్ట్రేషన్‌ వివరాలను పరిశీలించాలన్నారు. అనుమానాస్పదంగా తక్కువ ధరల పేరుతో వచ్చే ప్యాకేజీల ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే గంట లోపు 1930 సైబర్‌ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయాలని తెలిపారు. అలాగే www.cybercrime.gov.in నేషనల్‌ సైబర్‌ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని పేర్కొన్నారు.

డిగ్రీ పరీక్షల్లో 13 మంది డిబార్‌

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో బుధవారం నాలగవ సెమిస్టర్‌ పరీక్షల్లో 84 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.నరసింహులు తెలిపారు. ఓర్వకల్‌ జడ్పీహెచ్‌ఎస్‌ కేంద్రంలో 8 మంది, డోన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో 3, డోన్‌ వైష్ణవి డిగ్రీ కళాశాల, నంద్యాల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 13 మంది విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా డిబార్‌ చేశామన్నారు.

నీటిని పొదుపు చేస్తాం

టీబీ బోర్డు సెక్రటరీ రామకృష్ణారెడ్డి

హొళగుంద: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు(ఎల్‌–నినో) వచ్చే అవకాశాలు ఉండవచ్చని, నీటిని పొదుపు చేద్దామని టీబీ బోర్డు సెక్రటరీ రామకృష్ణారెడ్డి తెలిపారు. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)పై టీబీ బోర్డు ఎస్‌ఈ నారాయణనాయక్‌, ఎస్‌డీఓలు, సెక్షన్‌ ఆఫీసర్లతో కలసి బుధువారం ఆయన పర్యటించారు. కాలువలో నీటి పరిమాణం, గట్ల పరిస్థితి పరిశీలించారు. హొళగుంద సెక్షన్‌లో 180 కి.మీ. నుంచి 187 కి.మీ. వరకు, అలాగే 193 కి.మీ. వద్ద కాలువ ఎడమ గట్టు అధ్వానంగా ఉండడంతో గ్రావెల్‌ వేసి బాగు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 11 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉన్నాయని, ఎల్‌–నినో ప్రభావం ఏర్పడితే ఈ పొదుపు చేసిన నీటిని తాగునీటికి వాడుకోవొచ్చన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేర నీటిని వదులుతామని చెప్పారు. ప్రజలు కూడా ఎల్‌–నినోను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే నీటి పొదుపును చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement