ఆళ్లగడ్డ: భక్తుల గోవింద నామస్మరణలు.. పండితుల వేదమంత్రోచ్ఛారణలు.. డప్పుల వాయిద్యాలు మధ్య శ్రీ జ్వాలానరసింహుడి రథోత్సవం నేత్ర పర్వంగా కొనసాగింది. శ్రీ అహోబిలేశుడి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజైన బుధవారం ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీజ్వాలానృసింహస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తి పారవశ్యంతో రథం లాగారు. ఈ సందర్భంగా గోవిందా నామస్మరణతో నల్లమల ప్రాంతం మార్మోగిపోయింది. తొలుత ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలానృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పండితుల ఆధ్వర్యంలో అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలు, పసిడి ఆభరణాలతో ఉత్సవమూర్తులను అలంకరించి ప్రత్యేక పల్లకీలో కొలువుంచారు. దేవాలయం బయట ఉన్న రథం వరకు తోడ్కొని వచ్చారు. అప్పటికే వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేసిన రథంపై జ్వాలానరసింహస్వామి ఉభయ దేవేరులతో అధిష్టించారు. అనంతరం కొబ్బరికాయ సమర్పించి హారతిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థాన మాడ వీధుల్లో రథోత్సవం కనుల పండువగా జరిగింది.


