వెలుగోడు: వెలుగోడు పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థి విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం చెందాడు. స్థానికంగా తెలిసిన వివరాల ప్రకారం.. వెలుగోడుకు చెందిన నూరుల్లా కుమారుడు నౌమన్ (17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో బుధవారం మోతుకూరు గ్రామానికి తాపీ పనికి వెళ్లాడు. పని మధ్యలో టీ తాగి గ్లాస్‌ను పడేసేందుకు వెళుతూ ఇంటిపైన ఉన్న విద్యుత్ తీగలను గమనించకుండా తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మౌలానా కుటుంబం నిరుపేద కావడంతో చదువుతో పాటు పనికి వెళ్లినట్లు తెలుస్తోంది. తండ్రి బొప్పాయి పండ్ల వ్యాపారం చేస్తుండగా, కుటుంబానికి అండగా ఉండాలనుకున్న కుమారుడు తాపీ పనికి వెళ్లి అకాల మరణం పొందడం స్థానికులను కలచివేసింది. కుమారుడి మృతి విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


