శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లాలంటే నరకయాతన పడాల్సిందేనా? ఏన్నాళ్లిలా? ఈశ్వరా.. పరమేశ్వరా అంటూ భక్తులు వేడుకుంటున్నారు. శ్రీశైల దేవస్థానంలో రేకుల షెడ్డులో క్యూ కంపార్ట్‌మెంట్లు ఉండడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులను గంటల తరబడి కంపార్ట్‌మెంట్లలో ఉంచడంతో ఉక్కపోతతో చంటిపిల్లలు, వృద్ధులు, మహిళలు అనుభవించే అవస్థలు ఆ పరమేశ్వరుడికే ఎరుక. సామాన్య భక్తుల అవస్థలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెండేళ్లు గడస్తున్నా ఇంతవరకు నూతన క్యూ కాంప్లెక్స్‌పై నిర్ణయం తీసుకోకపోవడంతో హిందూ ధర్మంపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో ఇట్లే అర్థమవుతుంది.
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలగలసి వెలసిన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం. శ్రీశైల మహాక్షేత్రంలో పరమేశ్వరుడి రూపంలో మల్లికార్జున స్వామి, పార్వతీదేవిగా భ్రమరాంబాదేవి కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనునిత్యం వేలాది మంది, రద్దీ రోజుల్లో, ముఖ్యమైన పర్వదినాల్లో, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు శ్రీగిరికి తరలివస్తారు. శ్రీగిరికి తరలివచ్చిన భక్తుల్లో ఎక్కువ శాతం సామాన్య భక్తులే. సామాన్య భక్తులు ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనానికి వెళ్తారు. శ్రీశైల దేవస్థానంలో ఉచిత క్యూలైన్ ద్వారా దర్శనానికి వెళ్లే భక్తుల కోసం 17 కంపార్ట్‌మెంట్లు 28,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. 17 కంపార్ట్‌మెంట్లలో 7,200 మంది భక్తులు వేచిఉండే అవకాశం ఉంది. అలాగే క్యూలైన్ (స్టాండింగ్) 2,900 మంది భక్తులు వేచిఉండే అవకాశం ఉంది. మొత్తం 10,100 మంది ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా దర్శించుకునే అవకాశం ఉంది. అలాగే శీఘ్ర (రూ.150), అతిశీఘ్ర (రూ.300) క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనానికి వెళ్లేందుకు 13,250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో 3,360 మంది భక్తులు, క్యూలైన్ (స్టాండింగ్) 1900 మంది మొత్తం 5,300 మంది భక్తులు దర్శనానికి వేచిఉండే అవకాశం ఉంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం 1200 మంది వేచిఉండేలా నాలుగు క్యూలైన్లు, ఆలయంలో లోపల 1700 మంది వేచిఉండేలా నాలుగు ప్రత్యేక క్యూలైన్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా 25 కంపార్ట్‌మెంట్లలో 15,500 మంది భక్తులు వేచిఉండేందుకు అవకాశం మాత్రమే ఉంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే..
శ్రీశైల దేవస్థానంలో ఉన్న కంపార్ట్‌మెంట్లు రేకుల షెడ్డులే కావడంతో భక్తులు ఆయా కంపార్ట్‌మెంట్లలో ఎండ వేడికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చంటి పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో, ఉగాది ఉత్సవాల్లో, ముఖ్యమైన పర్వదినాల్లో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. దీంతో గంటల తరబడి క్యూ కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి. రేకులషెడ్డు కంపార్ట్‌మెంట్లలో భక్తుల అవస్థలు ఆ పరమేశ్వరుడికే ఎరుక. శ్రీశైల దేవస్థానంలో ఉన్న రేకులషెడ్డు క్యూ కంపార్ట్‌మెంట్లలో భక్తులు పడుతున్న కష్టాలను చూసిన అప్పటి శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అప్పటి ప్రభుత్వాన్ని ఓప్పించి రూ.75 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నూతన క్యూకాంప్లెక్స్ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అటు తరువాత క్యూ కాంప్లెక్స్‌కు టెండర్లు సైతం పిలిచారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలు రావడంతో టెండర్ల ప్రక్రియ అర్ధాంతరంగా అగిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు క్యూకాంప్లెక్స్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు. ఆ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే కుట్రతో ఇంతవరకు నూతన క్యూ కాంప్లెక్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శ్రీశైల దేవస్థానంలో భక్తుల అవస్థలు
ఎండలకు రేకుల షెడ్లలో గంటల తరబడి నరకయాతన
రూ.75 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్‌కు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన
రెండేళ్లైనా క్యూ కాంప్లెక్స్‌ను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం


