ఆదోని అర్బన్: మండలంలోని గణేకల్ గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి (55)పై అదే గ్రామానికి చెందిన వెంకటేష్ మంగళవారం అర్ధరాత్రి గొడ్డలితో దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. ఘటనపై తాలూకా సీఐ నల్లప్ప తెలిపిన వివరాలు.. హనుమంతరెడ్డి వలస వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం రాత్రి స్వగ్రామానికి వచ్చాడు. భార్య రామలింగమ్మ ప్రవర్తనపై వెంకటేష్ గ్రామంలో దుష్ప్రచారం చేస్తున్నాడని తెలుసుకుని అర్ధరాత్రి అతడిని నిలదీసేందుకు వెళ్లాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆగ్రహం చెందిన వెంకటేష్ గొడ్డలితో దాడి చేశాడు. గొడ్డలి వేటుకు హనుమంతరెడ్డి కుప్పకూలిపడిపోయాడు. విషయం తెలుసుకున్న పెద్దతుంబలం ఎస్‌ఐ విద్యశ్రీ ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన హనుమంతరెడ్డిని హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి కర్నూ లు ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక బుధవారం మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు సంతానం. మృతుడి భార్య రామలింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దతుంబలం ఎస్‌ఐ విద్యశ్రీ కేసు నమోదు చేసుకోగా, తాను దర్యాప్తు చేపడుతున్నట్లు తాలూకా సీఐ నల్లప్ప చెప్పారు. నిందితుడు వెంకటేష్‌పై గతంలోనూ ఓ హత్య కేసు నమోదై ఉన్నట్లు సీఐ తెలిపారు.
ఈవీఎంల భద్రతపై
అప్రమత్తంగా ఉండాలి
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్‌లోని గోదాములో భద్రపరచిన ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదామును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) భద్రతకు సంబంధించి సీసీ టీవీ పర్యవేక్షణ, ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్ నిర్వహణ రికార్డులను జాగ్రత్తగా ఉంచాలన్నారు. ఇన్‌చార్జ్ డీఆర్వో చిరంజీవి, ఎన్నికల విభాగం సూపరిటెండెంట్ మురళి పాల్గొన్నారు.


