కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో మంగళవారం జరిగిన రెండు, 6వ సెమిస్టర్ పరీక్షల్లో 213 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. నాల్గవ సెమిస్టర్‌కు 2,522 మందిలో 2,307 మంది హాజరయ్యారన్నారు. 6వ సెమిస్టర్‌కు 782 మందిలో 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఎమ్మిగనూరు రావూస్ డిగ్రీ కళాశాల కేంద్రంలో 4, చాగలమర్రి ఎస్వీ ఆర్ట్స్, కామర్స్ జూనియర్ కళాశాల కేంద్రంలో 3, ఆళ్లగడ్డ అనంత డిగ్రీ కళాశాల కేంద్రంలో 2, కర్నూలు ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో 2, కర్నూలు డిగ్రీ కళాశాల, నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 13మంది విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా డిబార్ చేశామన్నారు.
ఎల్లెల్సీకి నిలిచిన
నీటి సరఫరా
గోనెగండ్ల: తుంగభద్ర దిగువ కాలువకు నీటి విడుదల నిలిచిపోయింది. ప్రస్తుతం దిగువ ప్రాంతమైన గోనెగండ్ల సెక్షన్ వద్ద మంగళవారం 20 క్యూసెక్కుల నీరు మాత్రమే పారుతోంది. బుధవారం నాటికి నీటి విడుదల పూర్తి గా నిలిచిపోనున్నట్లు అధికారులు తెలిపారు. తాగునీటి అవసరాలకు ఈనెల 1వ తేదీ నుంచి ఎల్లెల్సీకి నీటి విడుదల చేపట్టడం తెలిసిందే.
బ్యాక్‌లాగ్ ఉద్యోగాల
ప్రకటనలో సవరణ
కర్నూలు(అర్బన్): ఈ ఏడాది మార్చి 18న ఇచ్చిన విభిన్న ప్రతిభావంతులు(దివ్యాంగుల) బ్యాక్‌లాగ్ ఉద్యోగాల ప్రకటనను సవరించినట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పోస్టుల్లో బధిరుల కేటగిరికి సంబంధించి 55 శాతం, ఆపైన వికలత్వం ఉంటేనే అర్హులని ప్రకటన ఇచ్చామన్నారు. అయితే రెండు చెవుల్లో శబ్ద తరంగాల ఫ్రీక్వెన్సీ 60 డీబీ నుంచి 70 డీబీ వరకు లోపం ఉన్న వ్యక్తులు మాత్రమే అర్హులన్నారు. ఈ కేటగిరికి చెందిన దివ్యాంగులు సవరణను గమనించాలని ఆమె పేర్కొన్నారు.
పత్తి విత్తనాలకు
హెచ్‌టీ పరీక్షలు
కర్నూలు(అర్బన్): వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గోడౌన్లను తనిఖీ చేసి పత్తి విత్తనాలకు హెచ్‌టీ పరీక్షలను నిర్వహించారు. తనిఖీల్లో కమిషనరేట్ (గుంటూరు) ఏడీఏ డి.ప్రవీణ్, ఏఓ జి.మోహన్ కుమార్, కర్నూలు ఏడీఏ ఎన్.సాలురెడ్డి, ఆగ్రోనామిస్ట్ ఏడీఏ రాజశేఖర్, కల్లూరు మండల వ్యవసాయ అధికారి డి.విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. కల్లూరు మండలం లక్ష్మిపురం గ్రామంలోని శ్రీరామ అగ్రిజెనెటిక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌లో 14 హెచ్‌టీ పరీక్షలు నిర్వహించగా అన్నీ నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే శ్రీరామ్ సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో 20 పరీక్షలు నిర్వహించగా, అక్కడ కూడా 20 నెగిటివ్ వచ్చాయన్నారు. సహజ సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో రికార్డ్సు అప్‌డేట్ చేయనందున రూ.62,29,914 విలువైన పత్తి విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేశామన్నారు.
క్వింటా వేరుశనగ రూ.6,860
ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 186 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా క్వింటా ధర రూ.6,860 పలికినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర రూ.4,690, మధ్యస్థ ధర రూ.6,136 పలికిందన్నారు. అదేవిధంగా ఆముదాలు 14 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటా రూ.5,570, మధ్యస్థ ధర రూ.5,772, గరిష్ట ధర రూ.5,880 పలికిందన్నారు. మొక్కజొన్న 10 క్వింటాళ్లు విక్రయానికి రాగా గరిష్ట ధర రూ.1,400లతో వ్యాపారులు కొనుగోలు చేశారు.


