కర్నూలు(టౌన్): పెట్రోల్, డీజిల్ దొరక్క ప్రజలు రోడ్డెక్కుతుంటే టీడీపీ ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు నగరంలో కొండారెడ్డి బురుజు వద్ద ప్రభుత్వం నిర్వహించే పెట్రోల్ బంకు, అలాగే పాతబస్టాండ్‌లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని పెట్రోలు బంకులు మూతపడ్డాయన్నారు. పెట్రోల్, డీజిల్ సంక్షోభం నేపథ్యంలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పెట్రోలు, డీజీల్ సంక్షోభంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పాతబస్టాండ్ వద్దకు ఖాళీ డీజిల్ డ్రమ్ములతో తరలివచ్చారు. ప్రజల ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు తెలియజేసేందుకు కారును తోసుకుంటూ వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ తెలంగాణలో పెట్రోలు, డీజిల్ సమస్య లేదని, మన రాష్ట్రంలో మాత్రం అర్ధరాత్రి వరకు బంకుల వద్ద వినియోగదారులు పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. డీజిల్ దొరక్క రైతులు వ్యవసాయ పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. విజనరీ ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబు హయాంలో ప్రజలకు అడుగడుగునా సమస్యలేనన్నారు. ఏపీలోనే ఎందుకు ఈ పరిస్థితి అని తెలుసుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. కూటమి నాయకులు డీలర్లతో కుమ్మకై డ్రమ్ములతో డీజిల్ తరలించి రైతులకు లీటర్‌పై రూ.10 అధిక ధరతో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. వారం రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం విహారయాత్రలు, సింగపూర్ అంటూ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై నా చంద్రబాబు సంక్షోభాన్ని నివారించకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రమైన కరోనా సమయంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన సాగించాడన్నారు. పార్టీ నేతలు షరీఫ్, గడ్డం రామకృష్ణ, నరసింహులు యాదవ్, తిరుమలేశ్వర రెడ్డి, కిషన్, రామాంజనేయులు, మాజీ కార్పొరేటర్లు క్రిష్ణకాంత్ రెడ్డి, షేక్ అహమ్మద్, షేక్ యూనుస్ బాషా, బబ్లూ, గోల్డ్ శ్రీను, కటారు కోండ సాయికుమార్, మహిళా నేతలు భారతి తదితరులు పాల్గొన్నారు.


