శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో చిరుతల సంచారం భయాందోళనకు గురి చేస్తోంది. కళాశాలకు సెలవులు వచ్చి విద్యార్ధులు హాస్టళ్లలో లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం రాత్రి సమయంలో రెండు చిరుతలు ఒకదాని వెంట మరొకటి రావడంతో అక్కడ ఉన్న వాచ్‌మెన్ గమనించి భయభ్రాంతులకు గురయ్యాడు. చిరుతల తరువాత ప్రాంగణంలోకి పెద్దపులి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు తమ సిబ్బందితో పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణాన్ని సందర్శించారు. సీసీ ఫుటేజీలో దృశ్యాలను గమనించారు. అలాగే ఆ ప్రాంతంలో వాటి పాదముద్రలు సేకరించారు. కళా శాల ప్రాంతం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో చిరుతలు కళాశాల ప్రాంగణంలోకి వచ్చాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.


