శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేసినట్లు ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆమర మంగళవారం ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి లడ్డూప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్లను ప్రారంభించారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి పూజాధికాలను జరిపి మిషన్లను ప్రారంభించారు. ఈ మిషన్ల ద్వారా భక్తులు దర్శనాలు, ప్రసాదాలు, కేశఖండన టికెట్లు పొందవచ్చని, దేవస్థాన వివిధ పథకాలకు విరాళాలు అందించవచ్చన్నారు. సీఆర్వో ఆఫీసు, మల్లికార్జున సదన్, గంగా సదన్, కల్యాణకట్ట, పాత విరాళాల కేంద్రం, గంగాధర మండపం వద్ద మిషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కరూర్ వైశ్య బ్యాంకు వారు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మిషన్లను దేవస్థానానికి విరాళంగా అందించినట్లు వెల్లడించారు.


