ఇద్దరు మహిళా దొంగలు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు మహిళా దొంగలు అరెస్ట్‌

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

బొమ్మలసత్రం: రైలులో ప్రయాణికులకు మాయమాటలు చెప్పి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు అపహరించే ఇద్దరు మహిళా దొంగలను రైల్వే పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ కుమారి తెలిపిన వివరాల మేరకు.. నందివర్గం గ్రామానికి చెందిన మనీష కుటుంబీకులతో ఆదివారం రాత్రి తిరుపతి నుంచి బయలుదేరిన రైలులో బనగానపల్లె చేరుకున్నారు. రైలు దిగిన తర్వాత 15 గ్రామాలు బంగారు చైన్‌ ఉన్న బ్యాగ్‌ కనిపించకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యూపీ రాష్టానికి చెందిన కుసమ్‌, రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన కిరణ్‌ దేవీలను అదుపులోకి తీసుకుని విచారించగా బంగారు చైన్‌ చోరీ వెలుగులోకి వచ్చింది. చైన్‌ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్‌ చేశామని ఎస్‌ఐ తెలిపారు.

బ్లాస్టింగ్‌ చేస్తూ బిహార్‌ వాసి దుర్మరణం

ఓర్వకల్లు: బ్లాస్టింగ్‌ నిర్మాణ పనుల్లో భారీ పేలుడు సంభవించడంతో ఓ బిహార్‌ వాసి మృతి చెందిన సంఘటన మండల కేంద్రం ఓర్వకల్లు వద్ద కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్లితే.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి ఓర్వకల్లు ప్రాంతంలో స్థాపిస్తున్న పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా నిమిత్తం ఏపీఐఐసీ వారు పైపులైను నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం జైరాజ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సమీపంలో ఓపెన్‌ బ్లాస్టింగ్‌ విధానంలో బండరాళ్లను పగులగొట్టి కాల్వను తవ్వుతున్నారు. సోమవారం బ్లాస్టింగ్‌కు విద్యుత్‌ తీగలను అమర్చుతున్న సమయంలో ఒక్కసారిగా విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న బిహార్‌కు చెందిన పురేంధర్‌ ఠాగూరు (60) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిప్తున్నట్లు తెలిపారు. పేలుడుకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సివుంది.

తహసీల్దార్‌ రామనాథరెడ్డి మృతి

నంద్యాల(న్యూటౌన్‌): సత్యసాయి జిల్లా ఎం.గూడూరు మండల తహసీల్దార్‌ రామనాథరెడ్డి సోమవారం నంద్యాల పట్టణంలో ఎన్‌జీఓ కాలనీ ఆయన నివాస గృహంలో మృతి చెందారు. నంద్యాల తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల డీటీగా, ఆర్‌ఐగా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై సత్యసాయి జిల్లా గూడూరు తహసీల్దార్‌గా మూడేళ్ల క్రితం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో సెలవుపై నంద్యాలకు వచ్చిన ఆయన కోలుకోలేక మృతి చెందాడు. రెవెన్యూ ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన పార్థీవ దేశాన్ని సందర్శించి నివాళులర్పించారు.

అనుమానాస్పదంగా యువకుడి మృతి

రుద్రవరం: నర్సాపురం గ్రామానికి చెందిన జయన్న(21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పెద్దరాముడు, మరియమ్మ ఏకై క కుమారుడు జయన్న వ్యవసాయకూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలోని చర్చి వెనుక భాగంలోనే వారి కుటుంబం ఉండటంతో రాత్రి సమయాల్లో చర్చి ప్రాంగణం, పైభాగంలో నిద్రించేవాడు. ఇందులో భాగంగా ఈ నెల 23 గురువారం రాత్రి భోజనానంతరం చర్చి పైభాగాన నిద్రించిన ఆ యువకుడు శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర గాయాలతో కింద పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అందించినప్పటికీ కోలుకోలేక సోమవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నట్లు ఎస్‌ఐ జయప్ప తెలిపారు.

టీడీపీ కార్యకర్తలకే

‘ఉపాధి’ పనులు

చాగలమర్రి: మండలంలోని శెట్టివీడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలకే ఉపాధి పనులు ఇస్తున్నారని గ్రామానికి చెందిన తలారి నరసింహుడు ఆరోపించారు. గ్రామానికి చెందిన కూలీలు సోమవారం పనికి వెళ్లి హాజరు వేయాలని ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు ఫోన్‌ చేయగా ఆమె భర్త టీడీపీ నాయకుడు బాషా మాట్లాడారన్నారు. ‘మీకు ఉపాధి హామీ పని లేదు.. హాజరు లేదు.. మస్టర్లు లేవు.. ఇది మా ప్రభుత్వం.. మేం చెప్పినట్లు వినాల్సిందే.. ఎవరికై నా వెళ్ళి చెప్పుకోండి’ అని ఫోన్‌ కట్‌ చేశాడన్నారు. ఈ విషయాన్ని పంచాయితీ కార్యదర్శి, ఈసీ, టీఏలకు తెలిపినా వారు అలాగే సమాధానం ఇచ్చారన్నారు. టీడీపీ నాయకుల అండదండలతో గ్రామంలో లేని వారి పేరు మీద జాబ్‌కార్డులు పొంది, హాజరు నమోదు చేసుకొని డబ్బులు దండుకుంటన్నారని ఆయన ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement