● అడిషనల్ ఎస్పీకి పత్తికొండ
మాజీ ఎమ్మెల్యే వినతి
కర్నూలు: పత్రికా స్వేచ్ఛ పేరుతో వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబ సభ్యులను, మహిళలను ఉద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కేసు నమోదుకు ఆదేశించాలని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాకు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వినతి వినతిపత్రం ఇచ్చారు. ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు తన అనుచరులతో సోమవారం ఆమె కర్నూలులోని డీపీఓకు వచ్చారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కార్యాలయంలో లేకపోవడంతో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాను కలసి వినతిపత్రం సమర్పించారు. మహిళలపై నీచపు వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని పత్తికొండ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. పత్తికొండ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె వినతిపత్రంలో కోరారు. వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాధాకృష్ణ అరాచకానికి చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్ వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఇదేమిటని ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు గ్రహణం పట్టిందని విమర్శించారు. రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలు సంతోషంగా ఉండాలంటే తిరిగి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు.


