శుభగాత్రి..గిరిజాపుత్రి! | - | Sakshi
Sakshi News home page

శుభగాత్రి..గిరిజాపుత్రి!

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

మహాశక్తి పీఠమైన శ్రీశైలంలో భ్రమరాంబాదేవి రూపంలో పార్వతీదేవి కొలువై ఉన్నారు. అయితే, ఎప్పుడూ ఆమె నిజరూపంలో కనిపించరు. ప్రత్యేక అలంకరణలో మాత్రమే భక్తులకు అనుగ్రహిస్తారు. ఏడాదిలో ఒక్క రోజు అది కూడా కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారు నిజరూపదర్శనంలో అగుపిస్తారు. నేడు వార్షిక కుంభోత్సవం సందర్భంగా భక్తులకు ఆ దర్శన భాగ్యం లభించనుంది. ఒకప్పుడు చెంచుల ఉత్సవంగా ఉన్న ఈ కుంభోత్సవం నేడు సకల జనులదిగా మారడం విశేషం.

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల ఆలయపు జానపద ఆచారాల్లో స్థానికులైన చెంచులకు సంబంధించిన అతి ముఖ్యమైన ఉత్సవం అమ్మవారి వార్షిక కుంభోత్సవం. ఉగాది ముగిశాక వచ్చిన మొదటి పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో ఈ వేడుక నిర్వహిస్తారు. గతంలో ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అమ్మవారి ఆలయం మూసివేసేవారు. సాయంత్రం చంద్రోదయం తర్వాత గుడి తెరచి అమ్మవారిని కేవలం పసుపు, కుంకుమలతో పూజించేవారు. ముందుగానే అమ్మవారి గర్భాలయం తెరచినప్పటికీ ముఖమండపంలోని శక్తియంత్రం వెనుకాల వండిన అన్నం పెద్ద రాశిగా పోసి ఒక దున్నపోతును తెచ్చి పసుపు, కుంకుమలతో అలంకరించి దాని తల నరికేవారు. తర్వాత ఆ తలను అన్నపురాసిపై దేవి విగ్రహాన్ని చూస్తున్నట్లుగా ఉంచేవారు. అలాగే నాలుగు మేకపోతులను బలిఇచ్చి అన్నపు రాశికి నాలువైపులా వాటి తలలను ఉంచి అవి నాలుగు దిక్కులు చూస్తున్నట్లుగా ఉంచేవారు. కాలక్రమేణ చెంచుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు, వ్యవహరాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికితోడు జంతు సంరక్షణ సమితితో పాటు మరికొన్ని స్వచ్చంధ సంస్థలు, జంతుప్రేమికుల విన్నపం మేరకు దేవస్థానం పరిధిలో జంతు బలులు నిషేధిస్తూ దేవదాయశాఖ చట్టం చేసింది. దీంతో జంతుబలి నుంచి సాత్వికబలి దిశగా కుంభోత్సవం మారింది. ప్రస్తుతం సాత్వికబలిలో భాగంగా వేలకొద్ది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. దేవస్థానం వారితో పాటు స్థానికులు, వ్యాపారులు, తమ గ్రామం, ఊరు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వందల కేజీల అన్నం, పెసరపప్పుతో కూడిన కుంభాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు.

కుంభోత్సవం రోజు పూజలు ఇలా

కుంభోత్సవం రోజున అమ్మవారికి ప్రాతఃకాల పూజలు యధావిధిగా జరిపించబడతాయి. తరువాత అర్చకస్వాములు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ, అష్టోత్తరపూజలు, జపపారాయణలు చేస్తారు. అయితే సంప్రదాయాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంలో నిర్వహిస్తారు. కుంభోత్సవం కారణంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. సాయంత్రం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం స్వామివారి ప్రదోషకాల పూజల అనంతరం విశేషంగా అన్నాభిషేకం జరిపిస్తారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని పూర్తిగా పెరుగన్నంతో కప్పివేస్తారు.

నిజరూప దర్శనం

ఎనిమిది చేతులలో వివిధ ఆయుధాలను ధరించి ఉన్న భ్రమరాంబాదేవి రోజూ అలంకారమూర్తిగా దర్శనమిస్తారు. అమ్మవారికి స్వర్ణముఖకవచం అలంకరింపబడి ఉంటుంది. అయితే, సంవత్సరంలో ఒక్క కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారి ముఖానికి కవచాలంకరణ ఉండదు. ఆ రోజున భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. రాత్రి 10గంటల సమయంలో అమ్మవారికి పునఃపూజలు, 9 రకాల పిండివంటలతో మహానివేదన గావించాక ఈ ఉత్సవం ముగుస్తుంది.

కుంభోత్సవం రోజు సాయంత్రం ప్రధానఘట్టం ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు చీరను ధరించి సీ్త్ర వేషంలో అమ్మవారికి హారతి తీసుకువస్తాడు. స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద విధులను నిర్వహించే ఉద్యోగి సీ్త్ర వేషాన్ని ధరిస్తాడు. స్వామిఅమ్మవార్ల సహస్రదీపాలంకరణ సేవా మండపం నుంచి భాజాభజంత్రీలతో ఈ హారతి తీసుకుని రావడం జరుగుతుంది. దీనికే కుంభహారతి అని పేరు. ఈ హారతి తెచ్చేటప్పుడు సీ్త్ర వేషధారి ముఖం కనపడకుండా చీరకొంగుతో ముసుగువేస్తారు. కుంభహారతి గర్భాలయం వద్దకు చేరుకున్న వెంటనే అర్చకులు గర్భాలయ ద్వారాలు తెరచి ఆ వేషధారి అమ్మవారికి హారతిని సమర్పించి అమ్మవారి తొలిదర్శనం చేసుకుంటారు. అంటే అమ్మవారిని మొదటగా దర్శించుకునేది ఈ సీ్త్ర వేషధారే.

శ్రీశైల భ్రమరాంబాదేవికి

నేడు వార్షిక కుంభోత్సవం

దక్షిణాచార సంప్రదాయంతో

జంతు బలులు నిషేధం

నాటి చెంచుల ఉత్సవం..

నేడు సకల జనుల ఉత్సవం

గుమ్మడికాయలు, కొబ్బరికాయలు,

నిమ్మకాయలతో అమ్మవారికి

సాత్వికబలి

అమ్మవారి నిజరూపదర్శనంతో

పులకించనున్న భక్తజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement