జీడీపీలో మట్టి తోడేళ్లు! | - | Sakshi
Sakshi News home page

జీడీపీలో మట్టి తోడేళ్లు!

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

పట్టుబడితే కేసు నమోదు చేస్తాం

టీడీపీ నేతల అండ యథేచ్ఛగా ఎర్రమట్టి తరలింపు

గోనెగండ్ల: టీడీపీ నేతల అండతో గాజులదిన్నె ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం జేసీబీలను ఏర్పాటు చేసుకున్నారు. పిల్లిగుండ్ల, నెరుడుప్పల గ్రామాల సమీపంలోని తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత 20 రోజుల నుంచి రోజుకు 100 నుంచి 150 ట్రాక్టర్ల దాకా మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దీనిని పలు గ్రామాల్లోని ఇళ్లు, వెంచర్లు నిర్మించే వారికి అమ్ముతున్నారు. ట్రాక్టర్‌ మట్టి రూ.వెయ్యి నుంచి రూ.1300 దాకా వసూలు చేస్తున్నారు. దూరం ఎక్కువగా ఉంటే మరింత ఎక్కువ వసూలు చేస్తున్నారు. జీడీపీ ఎగువ ప్రాంతంలో మట్టిని తవ్వాలంటే అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే టీడీపీ నేత అండ ఉండటంతో ఎర్రమట్టి మాఫియా చెలరేగిపోతోంది. మట్టి మాయం అవుతోందని, గాజులదిన్నె ప్రాజెక్టును కాపాడాలని అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు.

గుంతలమయం

అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసన్నుల్లోనే ఎర్రమట్టి మాఫియా యథేచ్ఛగా సాగుతోంది. గాజులదిన్నె ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులే అక్రమ ఎర్రమట్టి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్‌కు రూ.200 ఇవ్వాలని ఆ నాయకులు వసూలు చేస్తున్నారు. ఎర్రమట్టి కోసం జేసీబీలతో తవ్వడంతో జీడీపీ ఎగువ ప్రాంతం గుంతలమయంగా మారింది. ఆ ప్రాంతాలను రైతులు తమ పశువులను మేపించేందుకు వెళ్తుంటారు. అలాగే వేసవి కాలం కావడంతో ఆయా గ్రామాలకు చెందిన చిన్నారులు సరదాగా ఈతకు వెళ్తుంటారు. గతంలో గుంతలు పడిన ప్రదేశంలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. ఇప్పుడు కూడా మట్టి మాఫియా కోసం జేసీబీతో గుంతలు గుంతలు తవ్వడంతో మళ్లీ ప్రమాదాలు జరుగుతామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చాయి. మట్టి తవ్వకాలకు ఉన్నతాధికారుల నుంచి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వారం రోజులుగా మా సిబ్బందిని రాత్రి 12 గంటలకు వరకు కాపాలగా పెట్టాం. అయినా తప్పించుకొని తెల్లవారు జామున 3 గంటల సమయంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం.

– మహమ్మద్‌ ఆలీ, ప్రాజెక్టు ఏఈ

కళ్లుగప్పి తరలింపు

రాత్రిపూట అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తుండడంతో ఉదయం చూడగానే పెద్దపెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. వారం రోజులుగా రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ప్రాజెక్టు సిబ్బంది నలుగురు కాపలాగా ఉంటున్నారు. అయినప్పటికీ వారి కళ్లుగప్పి మట్టిని తరలిస్తున్నారు. ఆదివారం రాత్రి కూడా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరిగాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement