కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల మొత్తంగా అన్ని పంచాయతీల్లో ఉపాఽధి పనులు కల్పించడంపైనే దృష్టి సారిస్తామని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఐ.నరసింహారెడ్డి తెలిపారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ నూతన ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆయన సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇప్పటి వరకు పూర్తి అదనపు బాధ్యతలతో పీడీగా విధులు నిర్వహిస్తున్న మాధవీలత నుంచి నూతన ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల చివరి వరకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉంటుందని, మే నెల 1 నుంచి నూతన చట్టమైన వీబీజీ రామ్‌జీ అమలులోకి వస్తుందన్నారు. కొత్త చట్టంపై కూలీలకు, ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు.
కిరాణా షాపులోకి దూసుకెళ్లిన టిప్పర్
● తప్పిన ప్రమాదం
కోవెలకుంట్ల: పట్టణంలోని జమ్మలమడుగు చౌరస్తాలో సోమవారం సాయంత్రం ఓ టిప్పర్ కిరాణా షాపులోకి దూసుకెళ్లింది. టిప్పర్ గ్రావెల్ లోడ్‌తో నంద్యాల వైపు వెళుతుండగా పీఆర్ సినిమా థియేటర్ సమీపంలో డ్రైవర్ టిప్పర్‌ను నిలిపి కిందకు దిగాడు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో రోడ్డు స్లోబుగా ఉండటంతో ముందుకు కదిలి పక్కనే ఉన్న కిరణాషాపు వైపు దూసుకెళ్లింది. రోడ్డుపక్కనఆగి ఉన్న టూవీలర్ వాహనం టిప్పర్ టైర్ల కింద పడి నలిగిపోయింది. తర్వాత టిప్పర్ కిరణాషాపు వరండాను ఢీకొని ఆగిపోయింది. షాపు నిర్వాహకులు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి వాహనాన్ని నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
శ్రీశైలం ఘాట్ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు
శ్రీశైలం: దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్‌లోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 222/8 మైలురాయి నుంచి అటవీలోకి మంటలు వ్యాపించినట్లు శ్రీశైలం వస్తున్న వాహనదారుల తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలియదు కానీ అటవీ శాఖ అధికారులు త్వరగా స్పందించి మంటలను అర్పే ప్రయత్నం చేయకపోతే అడవిలో మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు.
15 క్వింటాళ్ల పత్తి దగ్ధం
ఆదోని అర్బన్: అమ్మకానికి తెచ్చిన 15 క్వింటాళ్ల పత్తి సోమవారం ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో కాలిపోయింది. విద్యుత్ తీగ నుంచి వచ్చిన మంటలు పత్తికి అంటుకుని ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను ఆర్పి వేశారు. పత్తి కాలిపోవడంతో రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని హానువాల్ గ్రామానికి చెందిన బారికి రాజు అనే రైతు తెలిపారు. తగలబడిన పత్తి ఎన్ని క్వింటాళ్లు ఉందో తెలుసుకుని ఇన్సూరెన్స్ వచ్చేటట్లు చర్యలు తీసుకుంటామని యార్డు సెక్రటరీ గోవిందు తెలిపారు. ఘటన స్థలాన్ని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పరిశీలించారు.
లారీ దగ్ధం
ఆదోని రైల్వేస్టేషన్ నుంచి ఎమ్మిగనూరుకు రేషన్ బియ్యాన్ని అన్‌లోడ్ చేసి తిరిగి వెళ్తున్న లారీ సోమవారం దగ్ధమయ్యింది. ఆదోని పట్టణ శివారులోని బైపాస్‌లోని నూతన బ్రిడ్జిపై ఈ దృశ్నాన్ని సూచి అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు.లారీలో బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగి రూ.2 లక్షలు నష్టం వాటిల్లిందని యజమాని షాషావలి తెలిపారు.
ఫీజు చెల్లించలేదని విద్యార్థులకు శిక్ష
● హాల్లో కూర్చోబెట్టిన ప్రైవేట్ స్కూల్
యాజమాన్యం
మంత్రాలయం రూరల్: ఫీజులు చెల్లించలేదని పరీక్ష రాయకుండా విద్యార్థులను హాల్లో కూర్చోబెట్టారు. మంత్రాలయంలోని ఓ ప్రవేట్ స్కూల్ (పరిమళ విద్యా నికేతన్)లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎంఈఓ–2 రాఘన్న.. పాఠశాలను తనీఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యహక్కు చట్ట ప్రకారం ముందస్తు ఫీజు ఎలా వసూలు చేస్తారన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా.. ఏడుస్తూ ఎనిమిదో వతరగతి తల్లిదండ్రులను పిలుచుకుని వచ్చి ఫీజు చెల్లించారు.


