కర్నూలు: కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో దోపిడీకి పాల్పడిన మహారాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టయ్యింది. గత నెల 17వ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి స్వామి, అమ్మవారికి చెందిన వెండి వస్తువులు అపహరించారు. దాదాపు 10 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ శర్మ, నరసింహశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు, ఉలిందకొండ, నాగలాపురం ఎస్‌ఐలు సునీల్ కుమార్, ధనుంజయ, అఖిల్‌లతో కలసి మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించి 20 రోజుల వ్యవధిలోనే కేసును పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజీ ద్వారా పక్కా ఆధారాలతో మహారాష్ట్ర ముఠానే ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. మహారాష్ట్ర పూణెకు చెందిన అర్జున్ పూనం కుంబ్హర్, మహారాష్ట్రలోని చించ్వడ్‌కు చెందిన అక్షయ్ జైసింగ్ ఠాకూర్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. తమ సహచరులు జర్నల్, అమిత్, బజరంగిలతో కలసి ఈ నేరం చేసినట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి 4 కిలోల వెండి ఆభరణాలు, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలు పెద్ద బోల్ట్ కట్టర్, స్క్రూ డ్రైవర్లు, గ్లౌజులు, నిందితులు నేరానికి ఉపయోగించిన వాహనాలతో పాటు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని ఇరువురు నిందితులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ చంద్రబాబు నాయుడులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు.
గూగుల్ మ్యాప్‌లో గుర్తించి దోపిడీ...
నిందితులు ఆలయ పరిసర ప్రాంతాలను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి మొత్తం ఐదుగురు రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడ్డారు. ఆలయం తాళాలు కట్ చేసి చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక సాక్ష్యాధారాలతో నిందితుల ప్రమేయాన్ని నిర్ధారించారు. అలాగే టోల్‌గేట్లలోని సీసీ ఫుటేజీ టెక్నాలజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. మిగిలిన మరో ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. త్వరలో వారిని కూడా అరెస్టు చేసి మిగిలిన వెండి ఆభరణాలు కూడా రికవరీ చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. ఆలయాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
గూగుల్ మ్యాప్ ద్వారా కాల్వబుగ్గ
ఆలయ పరిసరాలు గుర్తించి చోరీ
సీసీ ఫుటేజీ ద్వారా కేసు ఛేదించిన
పోలీసులు
నాలుగు కిలోల వెండి రికవరీ
వివరాలు వెల్లడించిన
ఎస్పీ విక్రాంత్ పాటిల్


