● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
చిప్పగిరి: రాష్ట్ర రాజధానిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ‘మావిగన్’పై రాష్ట్ర ప్రజలు సుముఖత వ్యక్తం చేస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే మాట్లాడారు. ‘మావిగన్’తో రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల చుట్టూ జాతీయ రహదారులు, సముద్రతీరం ఉందని అన్నారు. ఇవేవి పట్టించుకోకుండా కేవలం అమరావతి రాజధాని పేరుతో ఆ ప్రాంతం రైతులను, ప్రజలను మోసగించడానికే తీర్మానం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలో అమరావతి రాజధానిలో ఏం అభివృద్ధి చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా అభవృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. అమరావతి నిర్మాణం గ్రాఫిక్స్‌లో మాత్రమే కనిపిస్తోందని, ఆచరణలో మాత్రం లేదని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యమని అన్నారు.


