● బీజేపీ జెండా కట్ట నిర్మాణంలో వివాదం
● అడ్డుకున్న టీడీపీ నాయకులు
నందవరం: నందవరంలో టీడీపీ, బీజేపీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక సొసైటీ సమీపంలో బీజేపీ నాయకులు జెండా దిమ్మె నిర్మాణానికి పునుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఖాశీం వలి, గోపాల్ అడ్డుకున్నారని బీజేపీ మండల నాయకులు గురురాజ్ దేశాయ్ ఆరోపించారు. పోలీసులు దిమ్మె నిర్మాణాన్ని అడ్డుకోవడంతో బీజేసీ నాయకులు ధర్నా చేపట్టి ‘ఇదేమి రాజ్యం..ఇదేమి రాజ్యం..దొంగల రాజ్యం..దోపీడీ రాజ్యం’ ‘నందవరంలో టీడీపీ నాయకుల దౌర్జన్యం నశించాలి’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గురురాజ్ దేశాయ్ మాట్లాడుతూ..సోమవారం బీజేపీ ఆవిర్భా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పీవిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామకృష్ణ ఆదేశాల మేరకు నందవరంలో జెండా ఆవిష్కరణకు దిమ్మెను నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అయితే కుట్రపూరితంగానే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అనుచరులు ఖాశీంవలి, గోపాల్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని దురుద్దేశంతో దిమ్మె నిర్మాణాన్ని అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లోనే టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ దిమ్మె నిర్మించే చోటే టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన జెండా కట్టలు ఉన్నాయని, తమకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుపార్టీ నాయకులకుతో ఎస్‌ఐ తిమ్మారెడ్డి మాట్లాడి సమస్యను పరిష్కరించారు. జెండా కట్ట వద్ద పోలీసు బందోబస్తు చేపట్టారు.


