● రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
కర్నూలు: నగర శివారులోని ఓ పాఠశాలలో చదువుతున్న కుమారుడిని చూసేందుకు వచ్చిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన షేక్ తపాలా ఖాశీం బాషా (45)కు ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. ఇతనికి ఒక కొడుకు, కూతురు సంతానం. వీరు ప్రస్తుతం కర్నూలు శివారులోని మాంటెస్సోరి ఇండస్ స్కూల్‌లో చదువుతున్నారు. 8వ తరగతి చదువుతున్న కొడుకు సొహైల్‌కు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని ద్విచక్ర వాహనంపై బనగానపల్లె నుంచి శుక్రవారం కర్నూలుకు వచ్చాడు. పాఠశాలలో తన పిల్లలను చూసుకుని తిరిగి ద్విచక్ర వాహనంపై ఎన్‌హెచ్ 44 మీదుగా కర్నూలు నగరంలోకి వస్తుండగా కృష్ణానగర్ రావూరు ఫంక్షన్ హాల్ దగ్గర బ్రిడ్జిపైన వెనుక వైపు నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఖాశీం బాషా ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడ్డాడు. హెల్మెట్ ఊడి పక్కనే పడింది. తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలో పడివుండగా చుట్టు పక్కల ఉన్నవారు గుర్తించి ప్రైవేటు అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ట్రాఫిక్ పోలీసులు మార్చురీకి తరలించారు. మృతుడి భార్య షేక్ రిజ్వానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


