సమ్మతగేరి ఎస్‌ఎస్ ట్యాంకులో నీరు పూర్తిగా ఇంకిపోవడం వల్ల అక్కడున్న చౌడు భూముల్లో బోరు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల గ్రామంలోని ప్రజలు రోగాలకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. ఎస్‌ఎస్ ట్యాంకు నుంచి 25 రోజులకు పైగా నీటిని విడుదల చేయడం లేదు. గ్రామంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది.
– సీహెచ్ మల్లికార్జున,
చిన్నహ్యాట, హోళగుంద మండలం
జిల్లాలోని అన్ని ఎస్‌ఎస్ ట్యాంకుల్లో దాదాపు 50 శాతం వరకు నీటి నిల్వలు ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేది నుంచి ఎల్‌ఎల్‌సీకి నీరు విడుదల కానుంది. జిల్లా కలెక్టర్ ఇప్పటికే టీబీ డ్యాం అధికారులతో మాట్లాడారు. ఇరిగేషన్ అధికారులు కూడా నీటి విడుదలపై లేఖ రాశారు. పూర్తి స్థాయిలో నీటి ఇబ్బందులు ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తాం. ప్రస్తుత వేసవిలో ఎక్కడా నీటి సమస్య తలెత్తరాదని ప్రతి రోజు క్షేత్ర స్థాయిలోని అధికారులతో సమీక్ష చేస్తున్నాం. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం.
– సీహెచ్ మనోహర్, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్
● సమ్మతగేరి ఎస్‌ఎస్ ట్యాంకు నుంచి హొళగుంద మండలంలోని సమ్మతగేరి, కోగిలతోట, ముద్దటమాగి, ఎల్లార్తి, చిన్నహ్యాట, పెద్దహ్యాట, బీజీ హళ్లి గ్రామాలకు రక్షిత మంచి నీటిని అందించాల్సి ఉంది. అయితే ఎస్‌ఎస్ ట్యాంకులో నీరు పూర్తిగా ఇంకిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని పొలాల్లో బోర్లు, బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.
● హాలహర్వి మండలం చింతకుంట హెడ్‌వర్క్స్ నుంచి 14 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించాల్సి ఉంది. అయితే రిజర్వాయర్‌లో నీటి మట్టం ఐదు అడుగులకు పడిపోవడంతో చాలా గ్రామాలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ఈ రిజర్వాయర్ పరిధిలోని కొక్కరచేడు, శిరిగాపురం, టి.చాకిబండ, బేవినహాల్, శ్రీధరహాల్, ఎంకే పల్లి, మేదేహాల్ గ్రామాల ప్రజలు తీవ్ర తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.
కర్నూలు(అర్బన్): జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని మెజారిటీ గ్రామాల ప్రజలకు ఎల్‌ఎల్‌సీ నీరే ఆధారం. ఆయా నియోజకవర్గాల్లోని ఎస్‌ఎస్ ట్యాంకులను ఎల్‌ఎల్‌సీ నీటితో నింపితే, వేసవిలో నీటి కొరతను నివారించేందుకు అవకాశం ఉంటుంది. తుంగభద్ర డ్యాంలో కొనసాగుతున్న గేట్ల పనుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 10వ తేది నుంచి ఎల్‌ఎల్‌సీకి నీటి సరఫరాను నిలిపివేశారు. అయితే నీటి సరఫరా నిలిపివేయక ముందే ఆయా ఎస్‌ఎస్ ట్యాంకులను నింపుకున్నా, ప్రస్తుతం పలు ట్యాంకుల్లో నీరు అడుగంటడంతో అనేక గ్రామాలు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పలు గ్రామాల ప్రజలు తాగేందుకు మినరల్ వాటర్ క్యాన్లను కొనుగోలు చేస్తుండగా.. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఆయా గ్రామాల్లోని బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. కరువుకు ఆలవాలంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య కూడా వేధిస్తోంది. బాపురం రిజర్వాయర్ నీటిపై ఆధారపడిన నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు పట్టణంలోని ప్రజలు కూడా తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వారం, పది రోజులకు ఒకసారి ఇక్కడ నీటిని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు, జోహరాపురం గ్రామాల ప్రజల కష్టాలు చెప్పనలవి కాదు. ఎల్‌ఎల్‌సీ, తుంగభద్ర నది నీటిపై మొత్తం 26 సీపీడబ్ల్యూఎస్ స్కీంల ద్వారా 248 గ్రామాలకు రక్షిత మంచి నీటిని అందించాల్సి ఉంది. అయితే ఆయా ఎస్‌ఎస్ ట్యాంకుల్లో రోజు రోజుకు నీటి మట్టాలు పడిపోతుండడం వల్ల నిర్దేశించిన గ్రామాలకు నీరందని పరిస్థితి నెలకొంది.
రూ.8.48 కోట్ల వేసవి ప్రణాళికపై
నోరు మెదపని కూటమి ప్రభుత్వం
వేసవిలో జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 141 గ్రామాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తుగానే అంచనా వేసి తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు రూ.8.48 కోట్లు అవసరవుతాయని ఈ ఏడాది జనవరి 5న ప్రభుత్వానికి తెలియజేశారు. 13 మండలాల్లోని 79 గ్రామాలకు రూ.6.14 కోట్లతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, అలాగే ఆరు మండలాల్లోని 26 జనవాసాల్లో పశువులకు నీటిని అందించేందుకు రూ.44.17 లక్షలు, బోర్ల ఫ్లష్సింగ్‌కు రూ.19.65 లక్షలు, బోర్ల డీపెనింగ్‌కు రూ.1.44 కోట్లు, ఓపెన్ వెల్స్ డీపెనింగ్‌కు రూ.17.80 లక్షలు, రెండు ఎస్‌ఎస్ ట్యాంకులు నింపేందుకు రూ.8 లక్షలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజీనీర్లు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. అయితే నేటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.
ఎస్‌ఎస్ ట్యాంకుల ద్వారా
అందిస్తున్న నీటి వివరాలు
● ఎల్‌ఎల్‌సీ: 18 సీపీడబ్ల్యూఎస్ స్కీంల ద్వారా 180 హ్యాబిటేషన్లకు
● హెచ్‌ఎల్‌సీ: గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ద్వారా 7 హ్యాబిటేషన్లకు
● హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్(ఆలూరు బ్రాంచ్ కెనాల్ ): 1 హ్యాబిటేషన్‌కు
●టీబీ రివర్ ఇంటెక్‌వెల్స్, ఇతర సోర్సులు: 29 హ్యాబిటేషన్లకు
● జీడీపీ, కొత్తపల్లి రిజర్వాయర్: 15 హ్యాబిటేషన్లకు
● కేసీ కెనాల్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్: 16 హ్యాబిటేషన్లకు
మొత్తం చేతి పంపులు: 4235 పూర్తిగా పనికిరాకుండా పోయినవి: 1338
ఉపయోగంలో ఉన్నవి: 2700 పనిచేయనివి: 197
క్రాష్ ప్రోగ్రామ్‌లో మరమ్మతు చేసినవి: 126 మరమ్మతు చేయాల్సినవి: 75
గార్లదిన్నెలో ఎండుతున్న గొంతులు!
ఎమ్మిగనూరుసెంట్రల్: గార్లదిన్నె గ్రామంలో ప్రజలు బిందెడు నీటికి అష్టకష్టాలు పడుతున్నారు. మూడు రోజుల కొకసారి తాగునీరు సరఫరా చేస్తుండటంతో పడరాని పాట్లు పడుతున్నారు. అల్వాల సమ్మర్ స్టోరేజీ నుంచి పెసలదిన్నె మీదుగా 25 ఏళ్ల కిందట గార్లదిన్నె వరకు పైపులైన్ ఏర్పాటు చేశారు. పైపులైన్లు పాతవి కావడంతో తుప్పు పట్టి నీరు రంగుమారి వస్తోందని, కుళాయిల వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తోందిని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందెడు నీరు కూడా దొరకడం లేదని, ఎండా కాలంలో గొంతులు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రతిరోజు శుభ్రమైన నీటిని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
గొంతెండుతున్న పశ్చిమ పల్లెలు
ఎస్‌ఎస్ ట్యాంకుల్లో
అడుగంటుతున్న నీరు
ఈ ఏడాది జనవరి 10 నుంచి
నిలిచిపోయిన ఎల్‌ఎల్‌సీ నీటి సరఫరా
దాదాపు 141 గ్రామాల్లో నీటి సమస్య
ఉంటుందని గుర్తించిన అధికారులు
రూ.8.48 కోట్ల వేసవి ప్రణాళికపై
నోరు మెదపని ప్రభుత్వం


