కర్నూలు(అగ్రికల్చర్): గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీల కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. 2025 జూలై నెలలో చేపట్టిన వీఏఏల బదిలీలపై 35 మంది హైకోర్టును ఆశ్రయించడంతో వీరితో పాటు ఆప్షన్ పెట్టుకున్న 106 మంది వీఏఏలకు కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో కౌన్సెలింగ్ చేపట్టారు. గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి కూడా పాల్గొన్నారు. ‘సాక్షి’లో వీఏఏల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి మళ్లీ అక్రమాలు శీర్షికన కథనం ప్రచురితమవడంతో వ్యవసాయ యంత్రాంగం అప్రమత్తమైంది. 106 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
పొగను 8 నిమిషాల్లో నియంత్రించాం
కర్నూలు(సెంట్రల్): మరమ్మతుల్లో భాగంగా పొగ వచ్చిందని, దానిని ఎనిమిది నిమిషాల్లో నియంత్రించాయని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటు యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. మరమ్మతుల సమయంలో ఇలా పొగ రావడం చాలా సాధారణమని పేర్కొన్నారు. దానిని అంతర్గత భద్రతా బృందాలు పూర్తిగా నియంత్రించాయని, ఇందులో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగలేదని తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
శ్రీశైలం ప్రాజెక్టు: సున్నిపెంటలోని అక్కమహాదేవి సెంటర్ సమీపంలో ఎం. నవీన్ (46) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సున్నిపెంట సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. నవీన్ అప్పుల భారంతో మద్యానికి బానిసై అతిగా మద్యం సేవించి తూలిపడి మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, అతని తల్లి సరోజమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పీఆర్ ఎస్‌ఈగా జి.ప్రభాకర్‌రెడ్డి
కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం కర్నూలు పర్యవేక్షక ఇంజనీరుగా జి.ప్రభాకర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శశిభూషణ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పదోన్నతుల్లో భాగంగా అనంతపురం పీఆర్‌ఐ డివిజన్ ఈఈగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్‌రెడ్డికి ఎస్‌ఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్‌ఈగా విధులు నిర్వహిస్తున్న ఐ.వేణుగోపాల్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఎస్‌ఈగా ప్రభాకర్‌రెడ్డి ఏప్రిల్ 1న బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
అహోబిలం ప్రధాన
పరిపాలనాధికారిగా పార్థసారథి
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానం ప్రధాన పరిపాలనాధికారిగా పార్థసారథి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్ ఆదేశానుసారం చైన్నె నుంచి అహోబిలం చేరుకున్న ఆయన గురువారం దేవస్థానం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అహోబిలం దేవస్థానం అభివృద్ధితో పాటు భక్తులకు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్చకులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ క్షేత్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు. గత రెండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు సుమారు 12 మంది పరిపాలనాధికారులు మారడంతో పాటు బా ధ్యతలు చేపట్టిన మూడు నెలలకు మించి ఒక్కరు కూడా విధులు నిర్వహించలేక బాధ్యతల నుంచి తప్పుకుని వెళ్లిపోయారు. మొన్నటి దాక బాధ్యతలు నిర్వహించిన మరో వర్గం తమను కాదని చైన్నె నుంచి వచ్చిన ఇతను ఎన్ని రోజులు ఇక్కడ విధులు నిర్వహిస్తారో.. చూస్తాం అంటూ.. తేల్చిచెబుతున్నారు. స్థానిక నేతల ఒత్తిళ్లు, మఠం అసమ్మతి నేతల ఎత్తులను తట్టుకుని పార్థసారథి ఎన్నాళ్లు ఉంటారోననే చర్చ కొనసాగుతోంది.


