ఆదోని అర్బన్: మోసానికి పాల్పడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ అధ్యక్షుడు రామస్వామి, అవని గోల్డ్ ఎండీ వెంకటేశ్వర్లుపై జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రెడీమేడ్ గార్మెంట్స్ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు రాంబట్ల ప్రశాంత్ కోరారు. ఆదివారం స్థానిక ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవని గోల్డ్ ఆస్తులు 200 ఎకరాలు ఉన్నాయని, అందులో 160 ఎకరాలను 2013లోనే అమ్మేశారని తెలిపారు. అవని గోల్డ్ భూములను ఇప్పిస్తానని తన వద్ద ప్రస్తుత, మాజీ బీజేపీ అధ్యక్షులు రూ. 25 లక్షలు తీసుకున్నారని చెప్పారు. ఆయనతో పాటు అవని గోల్డ్ సంస్థకు చెందిన చైర్మన్, ఎండీ, డైరెక్టర్లు తనకు అగ్రిమెంటు రాసిచ్చారని వివరించారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి 50 ఎకరాలు అడిగారని అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో తాను విచారణ చేయగా 2013లోనే అవని గోల్డ్ భూములన్నీ అమ్మేశారని, వారిని నిలదీయడంతో ఈరోజు.. రేపు అని కాలయాపన చేస్తూ తనను మోసం చేశారన్నారు. ఈ మేరకు కేసు పెట్టానని తెలిపారు. ఈనెల 9వ తేదీన త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఈనెల 18వ తేదీన ప్రస్తుత, మాజీ బీజేపీ అధ్యక్షులు, అవినీగోల్డ్ సంస్థ చైర్మన్, ఎండీ, డైరెక్టర్లపై కేసు నమోదు అయిందన్నారు.


