పూజ్యాయ..రాఘవేంద్రాయ!
● నేటి నుంచి శ్రీరాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు ● 6 రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ ● పీఠాధిపతి నేతృత్వంలో ఏర్పాట్లు
మంత్రాలయం: ప్రహ్లాదరాయల స్వరూపులు.. సశరీరంగా బృందావనస్తులైన భక్తుల కల్పతరువు శ్రీరాఘవేంద్రస్వామి. పవిత్ర తుంగభద్ర నదీ తీరాన వెలసి ఖండాంతరాలకు ఖ్యాతిని గడించిన కామధేనువు. సద్గురు శ్రీరాఘవేంద్రులు జన్మదినం, పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని గురు వైభవోత్సవాలు ఈనెల 18 నుంచి 24 వరకు కనుల పండువగా జరగనున్నాయి. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆశీస్సులతో ఆరు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. 19వ తేదీన శ్రీగురుని 405వ పట్టాభిషేకం, 24న 431వ జన్మదినోత్సవాలు ప్రత్యేక వేడుకలు గావిస్తారు. ఉత్సవాల్లో భాగంగా రాఘవేంద్రుల స్వర్ణపాదుకలకు ముత్యాలు, రత్నాలు, పుష్పాలతో అభిషేకిస్తారు వైభవోత్సవాల్లో రోజూ రాయరు పాదపూజ, సంస్థానపూజ, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. 19వ తేదీన పాదుక పట్టాభిషేక పూజ చేపడతారు.అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున 23 వ తేదీన రాఘవేంద్రులస్వామికి పట్టు వస్రాలు సమర్పిస్తారు. 24వతేదీన శ్రీమఠం ప్రాంగణంలో శ్రీరాఘవేంద్ర నాదహరా సేవా ట్రస్ట్ తరఫున నాదహర సంపూర్ణ గానమృతం కార్యక్రమం నిర్వహిస్తారు.
ఏర్పాట్లలో అధికారులు
శ్రీరాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మఠం ప్రాకారాలను పుష్పాలతో, విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. రోజూ సాయంత్రం భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
రాఘవేంద్రుల ప్రశస్థి అవార్డులు :
గురుభక్తి వైభోత్సవాల్లో భాగంగా సామాజిక సేవ, వైద్యరంగం,వేదాంతం, సంగీతం, నాట్యం, న్యాయం శాఖ, దర్శకత్వం, గురుకుల కులపతులకు అభినందన–అభివందన అనుగ్రహ ప్రశస్థి అందజేయనున్నా రు. 41మంది ప్రముఖులకు ఈ సన్మానం కానిస్తారు. ఇందులో ఏపీ,బెంగళూరు, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు హరినారధన్ శర్మ్, పి. శ్రీసుధా, యం.దండాపాణి,ప్రధాన ఆర్చకులు క్రిష్ట శేషాచలం తీర్థులు (తిరుపతి),శ్రీనివాసదీక్షితులు(తిరుచానూర్),లింగంభట్ల దుర్గ ప్రసాద్ (విజయవాడ), ఏపీ ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్, పరిశ్రమల శాఖ మంత్రిటి.జి.భరత్, హోంశాఖ మంత్రి వంగళపూడి అనిత, తదితరులకు అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతిరోజూ ఊంజల మండపంలో జ్ఞానయజ్ఞ ప్రవచనాలు ఉంటాయి.
రాఘవేంద్రుల చరిత్ర
మూలరూపం : శంఖు కర్ణ
గోత్రం : గౌతమి
తండ్రి : తిమ్మన భట్
తల్లి : గోపికాంబ
జననం : క్రీ.శ.1595 మన్మథనామ సంవత్సరం పాల్గుణ శుద్ధ సప్తమి, గురువారం
జన్మ నక్షత్రం : మృగశిర
జన్మభూమి : భువనగిరి, కర్ణాటక
పూర్వ నామం : వెంకటనాథుడు
వివాహం : క్రీ.శ.1614, ఆనందనామ సంవత్సరం, పాల్గుణ శుద్ధ
భార్య : సరస్వతీబాయి
ఆశ్రమంలో పేరు : శ్రీరాఘవేంద్ర తీర్థులు
రచన గ్రంథాలు : శ్రీమన్యాయసుధ పరిమళ, 48 గ్రంథాలు
బిరుదులు : వెంకటనాథాచార్య, పరిమళాచార్య, మహాభాష్య
బృందావన ప్రవేశం : క్రీ.శ. 1671 వీరూధినామ సంవత్సరం, శ్రావణ బహుళ విదియ, శుక్రవారం
పూజ్యాయ..రాఘవేంద్రాయ!


