మహదానందం...మహానందీశుడి రథోత్సవం
● పెళ్లిపెద్దలతో కలిసి మహానందీశ్వరుడి దంపతుల విహారం
మహానంది: మహానందీశ్వరుడి రథోత్సవ కార్యక్రమం మహదానందంగా సాగింది. వధూవరులైన శ్రీ గంగ, శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర దంపతులు పెళ్లిపెద్దలైన శ్రీ పార్వతీ సహిత బ్రహ్మనందీశ్వరస్వామి వార్లతో కలిసి మహా రథంలో ఊరేగారు. భక్తులు, రైతులు స్వామి వారి దంపతులపై అరటి పళ్లు విసురుతూ భక్తిని చాటుకున్నారు.అంతకు ముందు నంద్యాల జిల్లా న్యాయమూర్తులు అమ్మన్నరాజా, శ్రీనివాసులు, ఆర్‌డీఓ విశ్వనాఽథ్, మహానంది ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ రమాదేవి తదితరులు రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం రథం వద్ద వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, పండితులు, రుత్వికుల ఆధ్వర్యంలో రథాంగ పూజ, కూష్మాండబలి, బ్రహ్మ, ఇతర దేవతల ఆవహానాది పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. సంప్రదాయంలో భాగంగా తిమ్మాపురం గ్రామానికి చెందిన వీరయ్య ఆచారి, కుటుంబ సభ్యులు కుంభాహుతిని (నైవేద్యం) తీసుకుని వచ్చి రథానికి సమర్పించారు. రథంలో కొలువైన మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. కాగా సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు.
మహదానందం...మహానందీశుడి రథోత్సవం


