ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా | - | Sakshi
Sakshi News home page

ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా

Feb 18 2026 7:25 AM | Updated on Feb 18 2026 7:25 AM

ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా

ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా

● మరోసారి ఎంప్లాయీస్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ స్థలం ఆక్రమణ ● అక్రమార్కులు తెలుగుదేశం పార్టీ వారే!

● మరోసారి ఎంప్లాయీస్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ స్థలం ఆక్రమణ ● అక్రమార్కులు తెలుగుదేశం పార్టీ వారే!

శ్రీశైలం ప్రాజెక్టు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారపార్టీ శ్రేణులు, మద్దతుదారులు బరితెగించారు. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. తాజాగా ఎంప్లాయీస్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ స్థలాన్ని కబ్జా చేసి స్థలం తమదన్నట్టు గ్రీన్‌మ్యాట్‌ కట్టారు. మహాశివరాత్రి ఉత్సవాల హడావుడిలో అధికార యంత్రాంగం ఉండగా సోమవారం తెల్లవారుజామున కొందరు ఈ ఆక్రమణకు పాల్పడ్డారు. 2017వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మండల నేత కో–ఆపరేటివ్‌ స్టోర్‌, స్టోర్‌కు సంబంధించిన స్థలాన్ని కబ్జాచేసి అధికార బలంతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాడు. ఈ స్థలం, భవనాలు జలవనరుల శాఖకు చెందినవి. వీటిలో ఉద్యోగులు కో–ఆపరేటివ్‌ స్టోర్‌ నిర్వహిస్తూ ఉండేవారు. అప్పటి కబ్జాదారులపై జలవనరులశాఖ అధికారులు ఉమ్మడి హైకోర్టుకు వెళ్లారు. కబ్జాధారులు సమర్పించిన పట్టాలు కమర్షియల్‌ పర్పస్‌కు ఇచ్చినవి కావని తేల్చి ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవాలని జలవనరులశాఖను హైకోర్టు ఆదేశించింది. దీంతో 2019వ సంవత్సరంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ను అధికారులు కూల్చివేశారు. అప్పటి నుంచి ఆ భవనాలు, స్థలం ఖాళీగా ఉంది. గత సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన వారుగా భావిస్తున్న కొందరు తిరిగి రెండోసారి ఆ స్థలాన్ని కబ్జా చేశారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్‌లో జలవనరుల శాఖకు చెందిన విలువైన పలు స్థలాలను కూటమి నేతలు వశం చేసుకుంటున్నారు. తాజాగా ఎంప్లాయీస్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ స్థలంపై కన్నేశారు. దీనిపై జలవనరులశాఖ ఈఈ ఎ.సురేష్‌ను వివరణ కోరగా తాను కోర్టు పనిమీద విజయవాడలో ఉన్నానని, ఆక్రమణ విషయం తనకు తెలియదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement