ఆకలి తీరుస్తూ..సేవలో తరిస్తూ!
● పాదయాత్ర భక్తుల సేవలో దాతలు ● నల్లమలలో పలుచోట్ల అన్నదాన శిబిరాలు ● ప్రతి రోజు లక్షలాది మందికి అన్నప్రసాద వితరణ
ఆత్మకూరు: శ్రీశైలమహాక్షేత్రంలో 1994లో శివదీక్షలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో మాల ధారణ చేసిన శివస్వాములు వారి గ్రామాలనుంచి పాదయాత్రగా బయల్దేరి శ్రీగిరికి చేరుకునేవారు. మార్గమధ్యంలో ఆకలిదప్పులతో ఇబ్బంది పడేవారు. నాడు దీనిని గుర్తించిన కొందరు శివస్వాములు అన్నదాన శిబిరాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అలా ప్రారంభమైన ఈ కార్యక్రమంలోకి దాతలు వచ్చారు. ఏటా శివరాత్రి, ఉగాది మహోత్సవాలకు కాలినడకన వెళ్లే భక్తులకు నల్లమలలోని ప్రధాన కూడళ్లలో అన్నదాన శిబిరాలు నిర్వహిస్తూ సేవలో తరిస్తున్నారు.
● వెంకటాపురంలో 28 ఏళ్లుగా..
శివస్వాముల పాదయాత్ర ప్రారంభమయ్యే వెంకటాపురం గ్రామంలో శ్రీమల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 28 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. సంతృప్తిగా భోజనం వడ్డించి వారి మన్ననలు పొందుతున్నారు.
● ఏటా లక్షమందికి భిక్ష
నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం వద్ద పెద్దదేవులాపురం గ్రామానికి చెందిన బాలవెంకటరెడ్డి అనే శివస్వామి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. 31 సంవత్సరాలుగా సాగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి కొనసాగిస్తున్నారు. ఏటా దాదాపు లక్షమందికి పైగానే ఇక్కడ భిక్ష స్వీకరిస్తున్నారు.
● పెచ్చెర్వు, దామర్లకుంటలో..
పెచ్చెర్వు, దామర్లకుంట ఫారెస్ట్ క్యాంపుల వద్ద అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వెంకటనారపురెడ్డి ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ సహకారంతో 6 సంవత్సరాలుగా శివరాత్రి ఉత్సవాల సమయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 3 లక్షల మందికి పైగా భక్తులకు అన్నదానం చేయడంతో పాటు ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 24 గంటల వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే పెచ్చెర్వు వద్ద గూడూరుకు చెందిన శ్రీవీరభద్రస్వామి దేవస్థాన అన్నదాన కమిటీ నిర్వాహకులు 27 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
● కై లాసద్వారం వద్ద....
పత్తికొండకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, శివభక్తుడు అయిన మురళీధర్‌రెడ్డి 25 సంవత్సరాలుగా కై లాసద్వారం వద్ద అన్నదాన శిబిరం నిర్వహిస్తున్నారు. కాలినడకన కై లాసద్వారం చేరుకున్న భక్తులు ఇక్కడ భిక్ష స్వీకరించి శ్రీశైలమహాక్షేత్రానికి చేరుకుంటారు.
అన్నం పర బ్రహ్మస్వరూపం. అందుకే అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అంటారు. ఇలాంటి మహత్తర కార్యక్రమం శ్రీశైల మహాక్షేత్రంలో 400 సంవత్సరాల కిత్రమే ప్రారంభమైందని చెబుతారు. నాటి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. పలువురు దాతలు సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలానికి కాలినడకన వస్తున్న భక్తులకు మార్గమధ్యంలో అన్నదాన శిబిరాలు నిర్వహిస్తూ ఆకలి తీరుస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ శిబిరాలను విరివిగా నిర్వహిస్తూ శ్రీశైలేశుడిపై తమ భక్తిని చాటుకుంటున్నారు.
ఆకలి తీరుస్తూ..సేవలో తరిస్తూ!
ఆకలి తీరుస్తూ..సేవలో తరిస్తూ!


