అహోబిలేశుడి రాకతో నక్కలదిన్నెలో పండుగ | - | Sakshi
Sakshi News home page

అహోబిలేశుడి రాకతో నక్కలదిన్నెలో పండుగ

Feb 11 2026 7:49 AM | Updated on Feb 11 2026 7:49 AM

అహోబి

అహోబిలేశుడి రాకతో నక్కలదిన్నెలో పండుగ

రుద్రవరం: పార్వేట ఉత్సవాల్లో భాగంగా అహోబిలేసుడి మండల పరిధిలోని నక్కలదిన్నెకు రావడంతో ఆ గ్రామంలో పండుగా వాతావరణం నెలకొంది. ఉత్సవమూర్తులైన శ్రీజ్వాలానరసింహ్మస్వామి, శ్రీప్రహ్లదవరద స్వామి పల్లకీ మంగళవారం గ్రామానికి చేరుకోగానే ప్రజలు ఎదురెళ్లి స్వాగతం పలికారు. తర్వాత పల్లకీ గ్రామ తెలుపులపై కొలువుదీరగా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని పూజలు చేశారు.

ఉద్యాన పంటల

సాగు పెంపుపై దృష్టి

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలో ఉద్యాన పంటల సాగును వచ్చే మూడేళ్లలో గణనీయంగా పెంచాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌ పేరిట రూపొందించిన యాక్షన్‌ ప్లాన్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాను కూడా చేర్చారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 70 వేలు, నంద్యాల జిల్లాలో 48 వేల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు ఉంది. కర్నూలు జిల్లాలో వచ్చే మాడేళ్లలో 60 వేలు, నంద్యాల జిల్లాలో 45 వేల హెక్టార్లలో అదనంగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ భావిస్తోంది. నీటిపారుదల శాఖ, ఏపీఎంఐపీ అనుసంధానంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇదిలాఉంటే 2023–24 సంవత్సరంతో పోలిస్తే 2024–25, 2025–26లో ఉద్యానశాఖ బడ్జెట్‌ గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఎంఐడీహెచ్‌, ఆర్‌కేవీవై పథకాలు అమలులో ఉన్నాయి. వీటి కింద ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా విడుదల కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌ ఏవిధంగా పట్టాలెక్కుతుందనేది ప్రశ్నార్థకం.

17 నుంచి జిల్లా స్థాయి శాప్‌ లీగ్‌ పోటీలు

నంద్యాల: ఈనెల 17 నుంచి జిల్లా స్థాయిలో శాప్‌ లీగ్‌ పోటీలు ప్రారంభం కానున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు తెలిపారు. మంగళవారం ఆయన శాప్‌ లీగ్స్‌ స్పోర్ట్స్‌–2026 క్యాలెండర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో 31 ప్రాధాన్యత గల క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు శిక్షణ ఇప్పించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేస్తామన్నారు. బాక్సింగ్‌, చదరంగం, అథ్లెటిక్స్‌, సైక్లింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, లాంగ్‌ టెన్నిస్‌, సాఫ్ట్‌ టెన్నీస్‌, ఆర్చరీ, బీచ్‌ హ్యాండ్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, ఈత, ఫుట్‌బాల్‌, బీచ్‌ వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌, జిమ్మాస్టిక్స్‌, బీచ్‌ కబడ్డీ, బ్యాట్మింటన్‌, జూడో, హాకీ, ఖోఖో, కబడ్డీ, రైఫిల్‌ షూటింగ్‌ తదితర క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో చెస్‌ పోటీలు 17వ తేదీన, సైక్లింగ్‌ పోటీలు 24వ తేదీన నంద్యాలలోని ఇండోర్‌ స్టేడియం జరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయిలో ఈనెల 21, 22 తేదీల్లో తిరుపతిలో, 28 నుంచి మార్చి 1వ తేదీ వరకు విజయవాడలో జరుగుతాయని వెల్లడించారు. ఈ క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శాప్‌ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత వివరాలతో నమోదు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం సెల్‌ : 87126 22576 నంబరును సంప్రదించాలన్నారు.

5 గ్యాస్‌ సిలిండర్ల సీజ్‌

కర్నూలు(సెంట్రల్‌): ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్‌లోని క్యాంటీన్‌లో వినియోగిస్తున్న 5 డొమెస్టిక్‌ సిలిండర్లను డీఎస్‌ఓ రాజారఘువీర్‌ ఆధ్వర్యంలోని బృందం సీజ్‌ చేసింది. క్యాంటీన్లలో కమర్షియల్‌ సిలిండర్లను వినియోగించాల్సిన సందర్భంలో డొమెస్టిక్‌ సిలిండర్లను వినియోగించడం నేరమని, అందుకే సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు డీఎస్‌ఓ వివరించారు.

ట్రాక్టర్‌ బోల్తా పడి

వ్యక్తి మృతి

ఆదోని అర్బన్‌: ట్రాక్టర్‌ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని పెద్దహరివానం గ్రామంలో ఈసంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. గజ్జహళ్లి గ్రామానికి చెందిన బొజ్జప్ప(58)పెద్దహరివానంలో నివసిస్తున్నాడు. ఇక్కడ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం కంకర తీసుకురావడానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో బొజ్జప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య నాగవేణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇస్వీ పోలీసులు తెలిపారు.

అహోబిలేశుడి రాకతో నక్కలదిన్నెలో పండుగ1
1/1

అహోబిలేశుడి రాకతో నక్కలదిన్నెలో పండుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement