ఇల కై లాసం.. బ్రహ్మోత్సవ శోభితం
● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు
శ్రీశైలంటెంపుల్: ఇలకై లాసమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీభ్రమరాంబికతో కలసి మల్లికార్జునుడు హంసవాహనంపై దర్శనమివ్వగా స్వామిఅమ్మవార్లను కన్నులారా దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. శ్రీగిరి క్షేత్రం భక్తుల శివన్మామస్మరణతో మారుమోగుతోంది. శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు హంసవాహనసేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్దగల అక్కమహాదేవి అలంకార మండపంలో హంసవాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను హంసవాహనంపై అధిష్టింపజేసి ఉభయదేవాలయాల ప్రధనార్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజా హారతులనిచ్చారు. మంగళవాయిద్యాలు మారుమోగగా, భక్తుల శివన్మామస్మరణతో హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం పరివార దేవతామూర్తులకు ప్రత్యేక కర్పూర నీరాజనాలు సమర్పించి గ్రామోత్సవాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ప్రారంభించారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు అక్కడి నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించి ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో నేడు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గోరోజు బుధవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు మయూరవాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం మయూరవాహనంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. అలాగే ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక దేవస్థానం, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.


