దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలా?
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డూ పై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం సిగ్గు చేటని వైఎస్సార్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాల చేయడం ఏమిటని మండిపడ్డారు. ఆలూరు లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ సిట్ అధికారులు, సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట మారలేదన్నారు. జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందనే అబద్ధాన్ని నిజం చేయాలని తపనపడడం ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలసి కుట్ర చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. తిరుమల లడ్డూలో కల్తీ లేదని తేలిపోవడంతో తాజాగా శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో సైతం కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త డ్రామాకు తెలేపారన్నారు. తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బీజేపీ నేతలు ఖండించకపోవడం చాలా దారుణమని ఎమ్మెల్యే అన్నారు.


