మోసగాళ్ల మాటలు నమ్మొద్దు
కర్నూలు(అర్బన్): దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు మోసపూరిత మాటలు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ జిల్లా మేనేజర్ రయిస్‌ఫాతిమా తెలిపారు. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి జిల్లాలోని దివ్యాంగులు ఎవరూ మోసపోవద్దని ఆమె సోమవారం ఒక ప్రకటనలో కోరారు. మూడు చక్రాల వాహనాల(స్కూటీ) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరైన వారికి జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలోనే నియమ నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు కార్యాలయ 08518 – 277864 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
పూర్వ డీఎంహెచ్‌ఓకు పెన్షన్ నిలిపివేత
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లా పూర్వ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మీనాక్షి మహదేవ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌తో పాటు గ్రాట్యూటీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2017 జూన్ 3వ తేదీన ఆదోనిలోని ఆదిత్య నర్సింగ్ హోమ్, స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు ఈమె రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని తీసుకుంటుండగా అప్పట్లో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు కోర్టు ఒక సంవత్సరం జైలు, రూ.10వేలు జరిమానా విధించారు. తాజాగా ప్రభుత్వం ఆమెకు వచ్చే పెన్షన్‌ను నిలిపివేయడమే కాకుండా గ్రాట్యూటీని ఆపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మెరుగైన సేవలు
అందించండి
కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ సీఎండీ, డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమానికి వచ్చే కాల్స్ పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి బిల్లింగ్, పోల్స్ తదితరాలకు సంబంధించిన సమస్యలను వివిధ ప్రాంతాల నుంచి పలువురు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం ద్వారా ఎస్‌ఇ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సత్వరం పరిష్కరించాలని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
నేటితో ముగియనున్న ప్రాక్టికల్ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. గత నెల 27న మొదలైన వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మూడు స్పెల్స్‌లో నిర్వహించారు. ఈ నెల 1వ తేది నుంచి మొదలైన జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు రెండు స్పెల్స్‌లో నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన పరీక్షలకు 40 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షలకు 1,566 మందిల్లో 1546 మంది హాజరయ్యారు. మద్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,341 మందిలో 1,321 మంది హాజరైనట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు.


