అంగన్‌వాడీ స్థలం కబ్జా | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ స్థలం కబ్జా

Feb 10 2026 7:52 AM | Updated on Feb 10 2026 7:52 AM

అంగన్‌వాడీ స్థలం కబ్జా

అంగన్‌వాడీ స్థలం కబ్జా

అలువాలలో టీడీపీ నాయకుడి దౌర్జన్యం

చోద్యం చూస్తున్న అధికారులు

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ప్రజలు

గోనెగండ్ల: టీడీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకు పరాకాష్టకు చేరుతున్నాయి. వారి ఆక్రమణకు పంట పొలాలు, ఇళ్ల స్థలాలు, చెరువుల స్థలాలు సరిపోవడం లేదు. ఏకంగా ప్రభుత్వ భవనానికి కేటాయించిన స్థలాన్నే కబ్జా చేశారు. గోనెగండ్ల అలువాల గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు అంగన్‌వాడీ భవనానికి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా పిల్లర్లు వేశాడు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో గ్రామస్తులతో కలిసి సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వైస్‌ ఎంపీపీ అలువాల వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు.

గడ్డి వాములు వేసి ఆక్రమణ

అలువాల గ్రామంలోని 160 సర్వేలో 25 సెంట్ల వాగు పరంబోకు భూమి ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆ స్థలంలో ఆర్‌బీకే, హెల్త్‌సెంటర్‌ను నిర్మించారు. అంగన్‌వాడీ భవనం కోసం 8 సెంట్ల స్థలం కేటాయించారు. ఆ స్థలంపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎస్‌. ఖాసీం సాహెబ్‌ కన్నువేశాడు. అదే స్థలంలో ముందుగా గడ్డి వాములు వేశాడు. అంతటితో ఆగకుండా పశువులు లేకున్నా గోకులంషెడ్‌ నిర్మాణానికి మంజూరు చేయించుకున్నాడు.

నోటీసులు ఇచ్చినా..

గోకులం షెడ్‌ నిర్మాణానికి ఇచ్చిన స్థలాన్ని ఎంపీడీఓ క్యాన్సల్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేయాలని పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. గ్రామస్తులు కోర్టులో కేసు వేశారు.

వెంటనే చర్యలు తీసుకోవాలి

అధికారులు నోటీసులు ఇచ్చినా, స్థలం కోర్టు పరిధిలో ఉన్నా టీడీపీ నాయకుడు ఎవరినీ లెక్కచేయకుండా రాత్రికి రాత్రే పిల్లరు వేశారని వైస్‌ ఎంపీపీ అలువాల వెంకట్రామిరెడ్డి, అలువాల గ్రామస్తులు తెలిపారు. స్థలం విలువ రూ.24 లక్షలు ఉంటుందని, వెంటనే ఖాళీ చేయించాలని కోరారు. గ్రామస్తులు భాస్కర్‌ రెడ్డి, రాముడు, మునిస్వామి, రంజాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement