పల్లెదారి..అధోగతి
రెండు సార్లు అవే పనులు మంజూరు
2వ వారం
అధ్వానంగా నిట్రవట్టి గ్రామ రహదారి
గుంతలు పడిన గూళ్యం–సిద్ధాపురానికి వెళ్లే రోడ్డు
కర్నూలు(అర్బన్): నాగరికతకు చిహ్నాలుగా నిలిచిన రోడ్ల అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం రోడ్లపై పడిన గుంతలను కూడా పూడ్చకపోవడం, ప్యాచ్ వర్కులు చేపట్టకపోవడవంతో గ్రామీణ రోడ్లు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జిల్లాలోని పలు రోడ్లకు నెలన్నర వ్యవధిలో రెండు పర్యాయాలు మంజూరు చేస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ఏపీ రూరల్ రోడ్స్ స్ట్రెంగ్తనింగ్ ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్‌ఎస్‌పీ) కింద జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రోడ్ల పనులను మంజూరు చేస్తూ గత ఏడాది డిసెంబర్ రెండో వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. రూ.60.09 కోట్ల అంచనా వ్యయంతో 111.110 కిలోమీటర్ల మేర రోడ్లను బలోపేతం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంజూరు చేసిన ఈ రోడ్లలో ఒక్క రోడ్డు (కటారుకొండ ఫామిన్ రోడ్ మల్యాల ఆర్‌ఎస్ నుంచి తెగదొడ్డి జంక్షన్) మాత్రం రూ. 8.23 కోట్లతో 14.960 కిలోమీటర్ల వేయనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన 25 రోడ్లు రూ.50 లక్షల నుంచి రూ.4 కోట్ల లోపు అంచనా వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే ఈ రోడ్లకు సంబంధించి అప్పట్లోనే పాలనా అనుమతులు మంజూరు చేసినా, ఇప్పటి వరకు ఎలాంటి టెండర్లను ఆహ్వానించ లేదు. కాగా, నెలన్నర రోజుల కాలయాపన అనంతరం ఇవే రోడ్ల పనులను రివైజ్‌డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పేరుతో ప్రభుత్వం ఈ నెల 4న తిరిగి తాజాగా మంజూరు చేస్తూ జీఓఆర్‌టీ నంబర్: 64ను జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీఓలో కంటే తాజాగా నాలుగు కిలోమీటర్ల మేర రో డ్డును, అంచనా వ్యయాన్ని రూ.2 కోట్లు మాత్రమే పెంచారు. అయితే ఈ పనులను ఏ పద్దు కింద విడుదల చేయనున్న నిధులతో చేపట్టాలనే అంశంపై స్ప ష్టత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాబార్డు రుణం లేదా కేంద్రం ఇచ్చే సాస్కీ (ఎస్‌ఏఎస్‌సీఐ – స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్‌వెస్ట్‌మెంట్) నిధులతో చేపట్టే అవకాశం ఉంటుందని ఇంజినీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సమయం మంజూరు అయిన పనులు కిలోమీటర్లు మొత్తం రూ. (కోట్లలో)
2025 డిసెంబర్ 26 111.110 రూ.60.09
4/02/2026 26 115.244 రూ.62.67
రోడ్లు వేయకుండా ప్రజలను
మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
నెలన్నర వ్యవధిలో రెండు సార్లు
అవే రోడ్లు మంజూరు
ఎక్కడా కనిపించని పనులు
ప్రజలకు తప్పనితిప్పలు
పల్లెదారి..అధోగతి


