బంగారు పల్లకీలో దివ్యతేజం
మంత్రాలయం: శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు పల్లకీలో ప్రహ్లాదరాయలు వైభవంగా విహరించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి ఆదివారం భక్తులు భారీగా వచ్చారు. తొలుత తుంగభద్రనదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు చేశారు. శ్రీరాఘవేంద్ర మూల బృందవనాన్ని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామదేవత మంచాలమ్మకు, మూల బృందవనానికి శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మహా మంగళహారతులు చేశారు.
నేటి పీజీఆర్‌ఎస్ రద్దు
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)ను సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించే మంత్రులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధిపతుల కాన్ఫరెన్స్ కారణంగా పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌ల రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని, ఎవరూ అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రాకూడదని తెలిపారు.
ఎస్పీ కార్యాలయంలో..
కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 9వ తేదీ సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సీఎం చంద్రబాబు వీడియో కాన్పరెన్స్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
నేటి నుంచి ‘ఫార్మాటివ్’ పరీక్షలు
కర్నూలు సిటీ: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి(సోమవారం)నుంచి నిర్మాణాత్మక మూల్యాంకన పరీక్షలు(ఫార్మాటివ్ అసెస్‌మెంట్)–4 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు 12వ తేదీ వరకు ఈ పరీక్షలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. వేర్వేరు సమయాల్లో 6, 7, 8, 9 తరగతులకు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి 19వ తేదీ వరకు ఫ్రీపైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన విద్యార్థులు 2.70 లక్షల మంది హాజరుకానున్నారు.
వణికిస్తున్న చలి
కర్నూలు(అగ్రికల్చర్): రాత్రి సమయంలో ప్రజలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ప్రతి ఏటా ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 21 నుంచి 23 డిగ్రీల వరకు నమోదయ్యేవి. ప్రస్తుతం 19.2 డిగ్రీల వరకే పరిమితం అయ్యాయి. తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంటోంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో చలి ప్రభావం కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి ఎండల తీవ్రత పెరుగుతోంది. రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
ప్రాక్టికల్ పరీక్షలకు 103 మంది గైర్హాజరు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఆదివారం 103 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. ఉదయం 61 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరుగగా 2,803 మందికిగాను 2,721 మంది హాజరై 82 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 54 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1,989 మందికిగాను 1968 మంది హాజరుకాగా, 21 మంది గైర్హాజరయ్యారు. ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు.
పనుల్లేక వలసబాట
కోసిగి: పనుల్లేక ఆర్లబండ గ్రామం నుంచి ఆదివారం 50 కుటుంబాలు వలసబాట పట్టాయి. ఇళ్లకు తాళాలు వేసి లారీలో పిల్లపాపలతో కలిసి గుంటూరుకు వెళ్తున్నట్లు వారు తెలిపారు. గ్రామంలో ఎలాంటి పనులు లేక పోవడంతో వలస వెళ్తున్నామని చెప్పారు. పిల్లలను బడి మానిపించి తమ వెంట తీసుకెళ్తున్నట్లు తెలిపారు. గుంటూరులో నెలన్నర రోజుల పాటు పనులు చేసుకుని తిరిగి స్వగ్రామానికి వస్తామన్నారు.
బంగారు పల్లకీలో దివ్యతేజం


