ఆదోని జిల్లా చేయకపోతే ఇక మహోద్యమమే
ఆదోని టౌన్/ఆదోని రూరల్: ఆదోని జిల్లా చేయకపోతే ఇక మహోద్యమం కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పేర్కొన్నారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా నిర్మల్ టాకీస్ ఆవరణానికి చేరుకుని రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షలను ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడారు. ఎన్నికల ముందు ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి నేడు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. విద్య, వైద్యం, తాగు, సాగునీరు, నిధులు కావాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలన్నారు. ఆరేకల్ వద్ద ఉన్న మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు. జిల్లాగా ఆదోని అన్నివిధాలుగా అర్హత ఉన్నప్పటికీ ప్రకటించకుండా చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తనకు ఇప్పటివరకు తెలియదని కుంటి సాకులు చెబుతున్నారన్నారు. సీఎంకు తెలియకుండా రాష్ట్రంలో ఏదైనా సమస్య వస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రస్థాయిలో రోజువారి సంఘటనలు సీఎంకు తెలియడం లేదంటే ఏమని చెప్పాలన్నారు. ఆదోని అభివృద్ధి చెందాలంటే జిల్లాగా ప్రకటించాలన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, చంద్రశేఖర్, రుద్రగౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ లోకేశ్వరి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు దేవా పాల్గొన్నారు.
37 రోజులుగా దీక్షలు
ఆదోని జిల్లా కావాలని మహిళలు, ప్రజలు, రైతులు, విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు 37 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేకపోతోంది. 37 రోజులుగా జిల్లా కోసం దీక్ష చేస్తున్నా చేతగాని చంద్రబాబు ప్రభుత్వమంటూ ప్రజా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వచ్చేది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనని అప్పుడు జిల్లాగా ఆదోనిని ప్రకటిస్తారని వైఎస్సార్‌సీపీ నేతలు చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన హామీని
చంద్రబాబు మరిచారు
కల్లబొల్లి మాటలతో
ప్రజలను మభ్య పెట్టొద్దు
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే
ఆదోని జిల్లా అవుతుంది
వైఎస్సార్‌సీపీ నేతల హెచ్చరిక
ఆదోని జిల్లా చేయకపోతే ఇక మహోద్యమమే


